రాత మారుతుందా?

12 Apr, 2014 00:45 IST|Sakshi
రాత మారుతుందా?

కింగ్స్ ఎలెవన్ పంజాబ్
  ఓనర్: ప్రీతి జింటా, నెస్‌వాడియా, ఒబెరాయ్ గ్రూప్
 కెప్టెన్: జార్జ్ బెయిలీ
 కోచ్:  సంజయ్ బంగర్
 ఫీల్డింగ్ కోచ్:
 ఆర్. శ్రీధర్ (హైదరాబాద్)
 గత ఉత్తమ ప్రదర్శన: సెమీఫైనల్ (2008)
 కీలక ఆటగాళ్లు: బెయిలీ, సెహ్వాగ్, మార్ష్, మిషెల్ జాన్సన్, మాక్స్‌వెల్, మిల్లర్
 
 ఐపీఎల్ తొలి సీజన్‌లో సెమీస్‌కు చేరిన జట్టు... ఆ తర్వాతి సీజన్లలో కనీసం లీగ్ స్టేజ్ కూడా దాటలేకపోయిందనే విమర్శలను మూటగట్టుకున్నా పంజాబ్ కింగ్స్ ఎలెవన్ ఈసారి భారీ ఆశలే పెట్టుకుంది. వీరేంద్ర సెహ్వాగ్‌లాంటి డాషింగ్ బ్యాట్స్‌మన్‌ను వేలంలో తీసుకోవడంతో కనీసం ఈసారైనా రాత మార్చుకోవాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది.

జట్టులో భారీ హిట్టర్లకు కొదువలేకున్నా... సమష్టిగా ఆడటంలో ఆటగాళ్లు విఫలమవుతున్నారు. దీంతో కచ్చితంగా గెలుస్తామనుకున్న మ్యాచ్‌ల్లోనూ చతికిలపడుతున్నారు. గత ఐదు సీజన్లలో యువరాజ్, జయవర్ధనే, గిల్‌క్రిస్ట్‌లాంటి మేటి ఆటగాళ్లు నాయకత్వం వహించినా... జట్టును విజయపథాన నడిపించలేకపోయారు. అయితే ఈసారి ఆస్ట్రేలియా టి20 జట్టు సారథి జార్జి బెయిలీ పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో కంగారూల జట్టుకు నాయకత్వం వహించిన అనుభవంతో పాటు బ్యాటింగ్‌లోనూ బెయిలీ కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. డేవిడ్ మిల్లర్ (దక్షిణాఫ్రికా), మానన్ వోహ్రాలను రిటైన్ చేసుకున్నా... కీలక ఆటగాళ్ల కోసం పంజాబ్ భారీ మొత్తంలో వెచ్చించింది. జాన్సన్ (రూ. 6.5 కోట్లు), మాక్స్‌వెల్ (రూ. 6 కోట్లు), బెయిలీ (రూ. 3.25 కోట్లు), సెహ్వాగ్ (రూ. 3.2 కోట్లు)లపైనే జట్టు గెలుపు అవకాశాలు ఎక్కువగా ఆధారపడి ఉన్నాయి. దేశవాళీ ఆల్‌రౌండర్ రిషి ధావన్‌కు రూ. 3 కోట్లు పెట్టడం ఆసక్తికరం.  
 
 బలాలు..
 తమదైన రోజున ఒంటిచేత్తో మ్యాచ్‌ను గెలిపించే ఆల్‌రౌండర్లు ఉండటం. మాక్స్‌వెల్, సెహ్వాగ్ ప్రమాదకర బ్యాట్స్‌మెన్. యాషెస్ హీరో మిషెల్ జాన్సన్ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఇతర బౌలర్లు రాణిస్తే పంజాబ్ విజయాన్ని అడ్డుకోవడం సులువు కాదు.

 బలహీనతలు...
 బ్యాటింగ్‌లో నిలకడలేమి. ఒకటి రెండు ఓవర్లలో భారీ పరుగులు చేసినా... ఆ తర్వాత టపటపా వికెట్లు కోల్పోవడం. దేశవాళీ క్రికెటర్లలో హిట్టర్లు లేకపోవడం. విదేశీ ఆటగాళ్లపై ఎక్కువగా ఆధారపడాల్సి రావడం బలహీనతలు. ఫీల్డింగ్ లోపాలను సవరించుకోవాల్సి ఉంది.
 
 జట్టు: భారత్‌కు ఆడిన క్రికెటర్ల్లు: సెహ్వాగ్, పుజారా, సాహా, బాలాజీ, మురళీ కార్తీక్, పర్వీందర్ అవానా.

విదేశీ క్రికెటర్లు: బెయిలీ, జాన్సన్, మార్ష్,  మాక్స్‌వెల్ (ఆస్ట్రేలియా), డేవిడ్ మిల్లర్, హెండ్రిక్స్ (దక్షిణాఫ్రికా) , తిసారా పెరీరా (శ్రీలంక).

 భారత దేశవాళీ క్రికెటర్లు: అనురీత్ సింగ్, రిషి ధావన్, గురుకీరత్ సింగ్, కరణ్‌వీర్ సింగ్, మన్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్, సందీప్ వర్మ, శివం శర్మ, శార్దుల్ ఠాకూర్,  మన్నన్ వోహ్రా.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా