అందుకు సమయం అవసరం:మనీష్

2 Sep, 2017 12:27 IST|Sakshi
అందుకు సమయం అవసరం:మనీష్

న్యూఢిల్లీ:భారత క్రికెట్ జట్టులో మరిన్ని ప్రయోగాలు చేయడానికి వెనుకాడబోమని కెప్టెన్ విరాట్ కోహ్లి నిర్ణయాన్ని సహచర ఆటగాడు మనీష్ పాండే స్వాగతించాడు. ప్రయోగాలు చేసినా, పలు విధాల మార్పులు చేసినా జట్టులో మరింత సమతుల్యం తీసుకురావడం కోసమేనని మనీష్ అభిప్రాయపడ్డాడు.వచ్చే వరల్డ్ కప్ కు దాదాపు 24 నెలలు సమయం ఉన్నప్పటికీ, అందుకు ఇప్పట్నుంచే పూర్తిస్థాయిలో సన్నద్ధం కావడం అవసరమన్నాడు. దీనిలో భాగంగా విభిన్నమైన కోణాల్లో జట్టును పరీక్షించడం ఒక ఛాలెంజ్ అన్నాడు.

 

'ప్రస్తుతం బ్యాటింగ్ ఆర్డర్ లో విరాట్ అనుసరిస్తున్న కొత్త కొత్త ప్రయోగాలకు  ఆటగాళ్లు అలవాటు పడటానికి సమయం పడుతుంది. ప్రధానంగా టాప్ ఆర్డర్ లో నాల్గో స్థానంలో నేను బ్యాటింగ్ కు వస్తూ ఉంటా. ఇప్పటి జట్టు పరిస్థితులకు తగ్గట్టు చూసుకుంటే ఆరోస్థానంలో రావాల్సి ఉంటుంది. ఆరోస్థానంలో బ్యాటింగ్ చేయడం చాలా కష్టం. ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వస్తున్నామంటే అది ఎక్కువ శాతం 40 ఓవర్ల తరువాతే మాత్రమే జరుగుతుంది. ఉదాహరణకు కేఎల్ రాహుల్ ని తీసుకుంటే అతను ఎప్పుడూ ఓపెనర్ గా వస్తూ ఉంటాడు. అటువంటిది సడన్ గా 30 ఓవర్ల తరువాత వస్తే కొద్ది ఇబ్బందిగానే ఉంటుంది.  కాకపోతే జట్టు ప్రయోజనం కోసం ఎక్కడైనా ఆడాలి. దీన్ని అలవరుచుకోవడానికి సమయం పడుతుంది'అని మనీష్ పాండే అభిప్రాయపడ్డాడు.ఇటీవల శ్రీలంకతో జరిగిన నాల్గో వన్డేలో మనీష్ పాండే అజేయ హాఫ్ సెంచరీతో మెరిశాడు.

 

మరిన్ని వార్తలు