మాకు రవిశాస్త్రే కావాలి..

3 Jul, 2017 18:35 IST|Sakshi
మాకు రవిశాస్త్రే కావాలి..

ముంబై: భారత జట్టు ఆటగాళ్లు ప్రధాన కోచ్ గా రవిశాస్త్రినే గట్టిగా కోరుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆటగాళ్లు క్రికెట్ దిగ్గజం సచిన్ ముందు ఉంచడంతో రంగంలోకి దిగిన మాస్టర్ రవిశాస్త్రిని కోచ్ పదవి దరఖాస్తు చేయించాడనే ప్రచారం జరుగుతోంది.  రవిశాస్త్రి 2014 నుంచి 2016  భారత జట్టుకు డైరెక్టర్ గా సేవలిందించాడు. ఈ సమయంలో రవిశాస్త్రితో ఆటగాళ్లకు సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతోనే వారు రవిశాస్త్రిని కోచ్ గా కోరుకుంటున్నట్లు సమాచారం. రవిశాస్త్రి డైరెక్టర్ గా ఉన్నపుడు భారత జట్టు అద్భుతంగా రాణించింది. 2015 వరల్డ్ కప్ లో సెమీస్  చేరింది.  22 ఏళ్ల తర్వాత శ్రీలంకతో టెస్టు సిరీస్ నెగ్గింది. సౌతాఫ్రికాతో జరిగిన నాలుగు టెస్టుల సిరీస్ ను 3-0 తో కైవసం చేసుకుంది.

రవిశాస్త్రి గత సంవత్సరం కూడా కోచ్ పదవికి దరఖాస్తు చేసుకున్నాడు కానీ గంగూలీ, సచిన్, లక్ష్మణ్ నేతృత్వంలోని సలహాదారుల కమిటీ కుంబ్లే వైపే మొగ్గు చూపింది. ఈ విషయంలో రవిశాస్త్రి గంగూలీ మధ్య అప్పట్లో మాటల యుద్దం బాహాటంగానే నడిచింది. తొలుత చాంపియన్స్ ట్రోఫీకి ముందు కోచ్ పదవికి దరఖాస్తుల ఆహ్వానించిన బీసీసీఐ కుంబ్లే రాజీనామా చేయడంతో ఆ గడవును జులై 9 కి పొడగించింది. ముందు కోచ్ పదవికి సుముఖత చూపని రవిశాస్త్రి సచిన్ సూచనతో దరఖాస్తు చేశాడని తెలుస్తోంది. బీసీసీఐ గడువు కూడా   రవిశాస్త్రి కోసమే పెంచిందని క్రికెట్‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు.  ఇప్పటికే కోచ్ పదవికి రవిశాస్త్రితో పాటు వీరేంద్ర సెహ్వాగ్, టామ్ మూడీ, దొడ్డ గణేష్, రిచర్డ్ పైబస్, లాల్ చంద్ రాజ్ పుత్ లు దరఖాస్తు చేసుకున్నారు. జులై 10 న సలహాదారుల కమిటి ఇంటర్వ్యూలు చేయనుంది. ఆరోజే ఈ కోచ్ పదవి సందిగ్ద వీడనుంది.

>
మరిన్ని వార్తలు