'మా క్రికెటర్లు వాంతులు చేసుకున్నారు'

4 Dec, 2017 11:25 IST|Sakshi

ఢిల్లీ: నగరంలోని తీవ్ర పొగ కాలుష్యంతో  ఫిరోజ్‌ షా కోట్ల మైదానంలో మూడో టెస్టు సందర్బంగా శ్రీలంక క్రికెటర్లు తీవ్ర అస్వస్థతకు గురైన విషయం వాస్తవమేనని ఆ జట్టు కోచ్‌ నిక్‌ పాథస్‌ సృష్టం చేశాడు. వాయు కాలుష్యం భరించలేకుండా ఉండటంతో స్టేడియం నుంచి ఉన్నపళంగా వచ్చేసిన ఇద్దరు ఆటగాళ్లు వాంతులు చేసుకున్నట్లు తెలిపాడు. భారత్‌తో మ్యాచ్‌లో కావాలనే లంక క్రికెటర్లు హైడ్రామా క్రియేట్‌ చేశారనే వాదనను నిక్‌ పాథస్‌ కొట్టిపారేశాడు.

'మా క్రికెటర్లు తీవ్ర ఇబ్బందులకు గురైన మాట వాస్తవం. ఫీల్డ్‌ ను విడిచి పెట్టి ముందుగానే స్టేడియంలో వచ్చిన క్రికెటర్లు వాంతులతో అస్వస్థతకు లోనయ్యారు. ఒక గేమ్‌ ఆడుతున్నప్పుడు ఆటగాళ్లు ఈ తరహాలో ఇబ్బంది పడటం చిన్న విషయం కాదు. మేము ఛేంజ్‌ అయిన రూమ్‌లో ఆక్సిజన్‌ సిలెండర్లు ఉన్నాయి. ఆ రూమ్‌లో లక్మల్‌ విరామం లేకుండా చాలాసేపు వాంతులు చేసుకుంటునే ఉన్నాడు.దీనికి కారణం చుట్టు అలుముకున్న పొగ కాలుష్యమే. మ్యాచ్‌ రిఫరీ, డాక్టర్లు వచ్చి పరిస్థితి సమీక్షించారు. ఇక మిగిలిన రోజుల మ్యాచ్‌ ఏమిటనేది రిఫరీ చేతుల్లోనే ఉంటుంది. ఒకవేళ మళ్లీ ఇదే తరహా పరిస్థితి ఏర్పడితే రిఫరీనే నిర్ణయం తీసుకుంటాడు'  అని ఆదివారం మ్యాచ్‌ ముగిసిన తరువాత నిక్‌ పాథస్‌ పేర్కొన్నాడు.

 

మరిన్ని వార్తలు