వెనక్కితగ్గే ప్రసక్తే లేదు: వార్నర్

19 Jun, 2017 18:55 IST|Sakshi
వెనక్కితగ్గే ప్రసక్తే లేదు: వార్నర్

మెల్బోర్న్:క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)కు ఆ దేశ క్రికెటర్లకు మధ్య కొనసాగుతున్న నూతన కాంట్రాక్ట్‌ వివాదానికి ఇప్పట్లో ఫుల్ స్టాప్ పడేటట్లు కనబడుటలేదు. ఆటగాళ్ల డిమాండ్ ను క్రికెట్ ఆస్ట్రేలియా ఎంతకీ పట్టించుకోకపోవడంతో అది మరింత ముదిరిపాకాన పడే పరిస్థితి కనబడుతోంది. ఈ క్రమంలోనే కొత్త కాంట్రాక్ట్ విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకునేది లేదని ఆసీస్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ మరోసారి స్పష్టం చేశాడు. ఇందులో ఆటగాళ్లు కూడా వారి డిమాండ్లపై దిగివచ్చే ప్రసక్తే లేదని పేర్కొన్నాడు.

 

సీఏ కొత్త కాంట్రాక్ట్ విధానం అమలు చేసిన పక్షంలో తాము నిరుద్యోగులుగా మారడానికి కూడా వెనకాడమన్నాడు. సీఏ పెద్దలు కొత్త కాంట్రాక్ట్ విధానంతో ఆటగాళ్లను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవాలనుకోవడం ఎంతవరకూ సమంజసమని ప్రశ్నించాడు. ఇక్కడ ఏ ఆటగాడు కూడా వెనక్కి తగ్గే యోచనే లేదని బోర్డును హెచ్చరించాడు. తమ షరతులకు లోబడి అంగీకారం తెలిపిన వారికి మాత్రమే కొత్త కాంట్రాక్ట్ను ఇస్తామంటూ సీఏ కొత్త నిబంధనను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై గత కొంతకాలంగా ఆసీస్ ఆటగాళ్లకు-బోర్డుకు మధ్య వివాదం నడుస్తోంది. దీనికి ఆటగాళ్లు ససేమేరా అంటుంటే, సీఏ కూడా నాన్చుడి ధోరణి అవలంభిస్తోంది.

మరిన్ని వార్తలు