ఆతిథ్య జట్టుతో ఆడటం సవాలే

1 Jul, 2018 04:29 IST|Sakshi
డిగో మారడోనా

డిగో మారడోనా

స్పష్టమైన ఫేవరెట్‌ లేకుండా నాకౌట్‌ పోరు మొదలైంది. ఈ దశలో ఆట ఎప్పటికప్పుడు మారుతుంది. అయితే ఇక్కడ కొన్ని మ్యాచ్‌ల్లో విజేతలెవరో అంచనాకు రావొచ్చు. రష్యా కంటే స్పెయిన్, డెన్మార్క్‌ కంటే క్రొయేషియా మెరుగైన జట్లు కాబట్టి ఆ రెండు జట్లకు గెలిచే అవకాశాలుంటాయి. ఈసారి జర్మనీలాగే... 2010 చాంపియన్‌ స్పెయిన్‌ కూడా నాలుగేళ్ల క్రితం లీగ్‌ దశలోనే కంగుతింది. దీనికి కారణాలు కూడా ఒకలాగే ఉన్నాయి. విజేతలుగా నిలిచిన సమయంలో అనుభవజ్ఞులు బాగా ఆడారు. ఇప్పటి స్పెయిన్‌లో కొత్తగా వచ్చిన వాళ్లు చాలా ప్రతిభావంతులు. తాజా ఆలోచనలు... భిన్నమైన గేమ్‌ప్లాన్‌లతో దేనికైనా సిద్ధంగా ఉన్నారు.

ఇదే స్పెయిన్‌ జట్టును టాప్‌ గేర్‌లో దూసుకెళ్లెలా చేయొచ్చు. అలాగే... అండర్‌డాగ్స్‌గా బరిలోకి దిగిన రష్యా ఆట కూడా చూడముచ్చటగా ఉంది. ఈ జట్టు తమదైన రోజు మేటి జట్లను ఘోరంగా దెబ్బతీస్తుంది. ప్రతిభపరంగా రష్యా మేటి జట్లకు దీటుగానే ఉంది. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో గెలిచి నాకౌట్‌ బెర్తును ఖాయం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో ఉరుగ్వేతో ఎదురైన పరాజయం రష్యాను నిరాశపరిచి ఉండొచ్చు... కానీ లుజ్నికి స్టేడియంలో ఆతిథ్య జట్టుతో మ్యాచ్‌ ఎలాంటి ప్రత్యర్థికైనా క్లిష్టమే! మరో మ్యాచ్‌ విషయానికొస్తే క్రొయేషియా పటిష్టమైన జట్టు. మోడ్రిక్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అనుభవం, నైపుణ్యంతో ఈ జట్టు అదరగొడుతోంది. డెన్మార్క్‌ను ఓడించే సత్తా క్రొయేషియాకు ఉంది.

మరిన్ని వార్తలు