హార్దిక్‌ మాటల్లో ఆంతర్యం ఏమిటి?

3 Jun, 2020 16:13 IST|Sakshi

లాంగ్‌ ఫార్మాట్‌కు స్వస్తి చెబుతాడా?

పరిమిత ఓవర్ల క్రికెట్‌కే పరిమితం అవుతాడా?

న్యూఢిల్లీ: కరోనా వైరస్‌తో సుదీర్ఘ లాక్‌డౌన్‌ను చూసిన క్రికెటర్లు ఎప్పుడు ఫీల్డ్‌లోకి దిగుదామనే చూస్తున్నారు. ఈ క్రమంలోనే వెన్నుగాయానికి శస్త్ర చికిత్స చేయించుకుని పూర్తిగా కోలుకున్న టీమిండియా ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా తన రీఎంట్రీపై ఆసక్తిగా ఉన్నాడు కాకపోతే వెన్నుగాయానికి సర్జరీ కావడంతో రిస్క్‌తోనే బరిలోకి దిగాల్సింది ఉంటుందని హార్దిక్‌ తెలిపాడు. పరిమిత ఓవర్ల క్రికెట్‌ వరకూ ఏమీ ఇబ్బంది ఉండకపోవచ్చు కానీ టెస్టు క్రికెట్‌ ఆడటం అనేది ఇబ్బందికర అంశమేనన్నాడు. ‘ నా వరకూ చూసుకుంటే భారత క్రికెట్‌లో నేను ఒక బ్యాకప్‌ సీమర్‌గా ఉన్నాననే విషయం తెలుసు. వెన్ను సర్జరీ తర్వాత టెస్టు క్రికెట్‌ను మునుపటిలా ఆడగలనా.. లేదా అనేది సందిగ్థమే. ఇక నుంచి టెస్టు ఫార్మాట్‌ నాకు సవాల్‌తో కూడుకున్న అంశం. ఒకవేళ నేను పూర్తి స్థాయి టెస్టు ప్లేయర్‌ని అయితే వైట్‌బాల్‌ క్రికెట్‌ ఆట ఉండకపోవచ్చు. (నాది కూడా అభినవ్‌ వర్ణ వివక్ష స్టోరీనే)

ప్రస్తుతం టెస్టు క్రికెట్‌కు వెళితే రిస్క్‌ చేయాల్సిందే. కానీ వైట్‌బాల్‌ క్రికెట్‌లో నా ప్రాధాన్యత ఏమిటో తెలుసు. ఒక సిరీస్‌లో నేను టెస్టు క్రికెట్‌ను ముందుగా ఆడి ఆ తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడితే రాణించలేకపోయేవాడిని. టెస్టు ఫార్మాట్‌, పరిమిత ఓవర్ల క్రికెట్‌ను బ్యాలెన్స్‌ చేయడం కష్టమయ్యేది. ఎందుకంటే నాయొక్క ప్లస్‌ పాయింట్‌ నా ఎనర్జీనే.  ఒక దాంట్లో రాణిస్తే మరొకదాంట్లో పూర్తి స్థాయిలో ప్రదర్శన చేయలేకపోయేవాడిని’ అని హార్దిక్‌ తెలిపాడు. అంటే టెస్టు ఫార్మాట్‌ ఆడాలా.. లేక పరిమిత ఓవర్ల క్రికెట్‌ ఆడాలా అనే డైలమాలో ఉన్నాడు హార్దిక్‌. పరిమిత ఓవర్ల క్రికెట్‌లో కీలక ఆటగాడైన హార్దిక్‌కు టెస్టు క్రికెట్‌ను వదిలేయాలనే ఉద్దేశం కూడా కనబడుతోంది. 2018లో వెన్నుగాయం బారిన పడిన హార్దిక్‌.. గతేడాది దానికి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. తన రీఎంట్రీ ఫిట్‌నెస్‌ పరీక్షల్లో భాగంగా దేశవాళీ మ్యాచ్‌ల్లో చెలరేగిపోయిన హార్దిక్‌.. ఇప్పుడు మళ్లీ బరిలోకి దిగి సత్తాచాటాలనుకుంటున్నాడు.కాగా, వైట్‌బాల్‌ క్రికెట్‌కే హార్దిక్‌ అధిక ప్రాధాన్యత ఇస్తే మాత్రం టెస్టు క్రికెట్‌లో అతనికి ప్రత్యామ్నాయం వెతకాల్సిందే.(‘ధోనిని మిస్సవుతున్నా.. మళ్లీ ఆ రోజులు రావాలి’)

మరిన్ని వార్తలు