ఐపీఎల్‌: ఎంతటి లక్ష్యమైనా మా ముందు దిగదుడుపే!

11 Apr, 2018 10:38 IST|Sakshi
23 బంతులలో 56 పరుగులు చేసిన సామ్‌ బిల్లింగ్స్‌

లెజెండ్స్‌తో ఆడటం ఆనందంగా ఉంది

చెన్నై ఆటగాడు సామ్‌ బిల్లింగ్స్‌

చెన్నై:  కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తో (కేకేఆర్‌) జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో సామ్‌ బిల్లింగ్స్‌ మెరుపు ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. 23 బంతులలో 56 పరుగులు చేసిన అతను సొంతగడ్డపై చెన్నై సూపర్‌కింగ్స్‌కు అపూర్వ విజయం అందించాడు. దీంతో చెన్నై చెపాక్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో 200 పరుగులకుపైగా లక్ష్యాన్ని ఛేదించి.. కోల్‌కతాపై ఐదు వికెట్లతో తేడాతో చెన్నై గెలుపొందింది. రెండేళ్ల నిషేధం తర్వాత చెన్నైలో ఆడుతున్న తొలి మ్యాచ్‌ కావడం.. ఈ మ్యాచ్‌లో ఘనవిజయం సాధించడం సీఎస్కే జట్టులో కొత్త ఉత్సాహం నింపింది.

చెన్నైలోని లెజెండ్‌ ఆటగాళ్లతో ఆడటం ఎంతో సంతోషంగా ఉందని మ్యాచ్‌ అనంతరం సామ్‌ బిల్లింగ్స్‌ చెప్పాడు. తమ జట్టు మిడిలార్డర్‌లో ధోనీ, రైనా, జడ్డేజా వంటి బిగ్‌ హిట్లర్లు ఉన్నారని, ఎంతటి లక్ష్యమైనా తమ జట్టు ఛేదించగలదనే విషయం తమకు తెలుసునని ధీమా వ్యక్తం చేశాడు. ‘రైనా, ధోనీ, హర్భజన్‌ వంటి లెజెండ్స్‌తో ఆడటంతో ఎంతో సంతోషంగా ఉంది. కోచ్‌గా మైక్‌ హస్సీ కూడా ఎంతో విలువైన మార్గదర్శకత్వాన్ని అందిస్తున్నారు. వారి నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. కొన్ని ఆప్షన్స్‌తో మేం మైదానంలోకి దిగాం. మూడు భిన్నమైన ప్రణాళికలు వేశాం. మొదట వచ్చిన బ్రేవో అందులో భాగంగానే ఆడాడు. రైనా, ధోనీ, జడ్డేజా వంటి బిగ్‌ హిట్టర్లు మిడిల్‌ ఆర్డర్‌లో ఉన్నారు. ఈ బ్యాటింగ్‌ టీమ్‌కు ఎంతటి లక్ష్యమైనా ఛేదించడం కష్టం కాదు’ అని బిల్లింగ్స్‌ చెప్పాడు.

రెండేళ్ల తర్వాత చెప్పాక్‌లో విజయంతో పునరాగమనం చేయడం సంతోషంగా ఉందని ధోనీ హర్షం వ్యక్తం చేశాడు. ‘రెండేళ్ల తర్వాత విజయం పునరాగమనం చేయడం ఆనందంగా ఉంది. మొదటి ఇన్నింగ్స్‌లోనూ, రెండో ఇన్సింగ్స్‌లో ప్రేక్షకులు మ్యాచ్‌ను ఆస్వాదించారు. ప్రతి ఒక్కరికీ భావోద్వేగాలు ఉంటాయి. వాటిని అదుపులో ఉంచుకోవాలని ప్రతి ఒక్కరినీ మేం కోరుతున్నాం’ అని ధోనీ అన్నారు. ఈ సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసుకున్న వ్యక్తిగా నిలిచిన షేన్‌ వాట్సన్‌ మాట్లాడుతూ.. తమకు అండగా నిలిచిన చెన్నై ఫ్యాన్స్‌కు థాంక్స్‌ చెప్పాడు.

>
మరిన్ని వార్తలు