ఆ రెండింటిని ముడిపెట్టొద్దు: ఐసీసీ

19 Oct, 2015 15:41 IST|Sakshi
ఆ రెండింటిని ముడిపెట్టొద్దు: ఐసీసీ

న్యూఢిల్లీ: రాజకీయాలను, క్రికెట్ ను ఒకే పార్శ్వంలో చూడవద్దని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) హితవు పలికింది. పాకిస్థాన్ తో డిసెంబర్ లో జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ చర్చల్లో భాగంగా ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ షహర్యార్ కు బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ ఆహ్వానం పంపడంపై సోమవారం శివసేన కార్యకర్తలు ముంబైలోని బీసీసీఐ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు.

 

దీన్ని ఐసీసీ తీవ్రంగా తప్పుబట్టింది. రాజకీయాలను-క్రికెట్ ను ఒకే కోణంలో చూడటం ఎంతమాత్రం మంచిది కాదని ఐసీసీ అధ్యక్షుడు జహీర్ అబ్బాస్ తెలిపారు. క్రీడలు, రాజకీయాలు అనేవి ఎప్పుడూ వేర్వేరుగానే ఉంటాయి. అటువంటప్పుడు క్రీడలతో రాజకీయాలను ఎందుకు ముడిపెడుతున్నారని ప్రశ్నించారు. 'నేను పాకిస్థాన్ మాజీ క్రికెటర్ నే కావొచ్చు. అందులో కొత్తేమి లేదు. కానీ ప్రస్తుతం ఐసీసీ అధ్యక్షుణ్ని.  క్రికెట్ ను ప్రపంచవ్యాప్తం చేయాలని కోరుకుంటున్నాను' అని జహీర్ అబ్బాస్ తెలిపారు. ఈరోజు ఉదయం ఇండో - పాక్‌ సిరీస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శివసేన కార్యకర్తలు బీసీసీఐ  కార్యాలయంలోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. బీసీసీఐ ప్రెసిడెంట్‌ శశాంక్‌ మనోహర్‌ ఛాంబర్‌లోకి చొరబడిన శివసేన కార్యకర్తలు ఆయనతో వాగ్వాదానికి దిగి సిరీస్ పై చర్చలు వద్దంటూ ఆందోళన చేపట్టారు.

మరిన్ని వార్తలు