ముంబై ఇండియన్స్‌కి మతిపోయేలా...

20 May, 2018 19:35 IST|Sakshi

 రెండు సార్లు మ్యాక్స్‌వెల్‌-బౌల్ట్‌ ‘మ్యాజిక్‌’

ఢిల్లీ: ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ ఆటగాడు మ్యాక్స్‌వెల్‌ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌తో అదుర్స్‌ అనిపించాడు. ముంబై ఇండియన్స్‌ ఆటగాడు కీరోన్‌ పొలార్డ్‌ ఇచ్చిన క్యాచ్‌ను మ్యాక్స్‌వెల్‌ బౌండరీ లైన్‌ వద్ద బంతిని అందుకున్న తీరు ఒక ఎత్తైతే, తనను తాను నియంత్రించుకుంటూ గాల్లోనే బంతిని మరో ఫీల్డర్‌ బౌల్ట్‌కు అందివ్వడం మరో ఎత్తు. ముంబై బౌలర్‌ లామ్‌చెన్‌ వేసిన 10వ ఓవర్‌ తొలి బంతిని లాంగాన్‌ మీదుగా పొలార్డ్‌ భారీ షాట్‌ కొట్టాడు. ఆ సమయంలో బంతి గమనాన్ని అంచనా వేస్తూ పరుగెత్తూకొంటూ వచ్చిన మ్యాక్స్‌వెల్‌ బంతిని బౌండరీకి స్వల్ప దూరంలో ఒడిసిపట్టుకున్నాడు.

కాగా, బౌండరీ లైన్‌పై నియంత్రించుకునే క్రమంలో బంతిని  సమీపంలో ఉన్న బౌల్ట్‌ వైపు విసిరేశాడు. ఆ క్యాచ్‌ను బౌల్ట్‌ అందుకోవడంతో పొలార్డ్‌ను ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ క్యాచ్‌పై మూడో అంపైర్‌ సాయం కోరగా, మ్యాక్స్‌వెల్‌ బౌండరీ లైన్‌కు ముందుగానే బంతిని విసిరినట్లు తేలడంతో పొలార్డ్‌ భారంగా పెవిలియన్‌ వీడాల్సి వచ్చింది. అయితే రోహిత్‌ శర్మ ఔట్‌ విషయంలో కూడా మ్యాక్స్‌వెల్‌-బౌల్ట్‌లు ఇదే సీన్‌ రిపీట్‌ చేశారు. హర్షల్‌ పటేల్‌ వేసిన 14 ఓవర్‌ ఐదో బంతికి రోహిత్‌ షాట్‌ కొట్టాడు. ఆ క్యాచ్‌ను ముందుగా అందుకున్న మ్యాక్స్‌వెల్‌.. బౌండరీ లైన్‌పై నియంత్రణ కోల్పోతున్నట్లు భావించి బౌల్ట్‌కు విసిరాడు. దాన్ని బౌల్ట్‌ పట్టుకోవడం, రోహిత్‌ పెవిలియన్‌ చేరడం ముంబై ఇండియన్స్‌కు మతిపోయేలా చేసింది. ఈ సీజన్‌లో కింగ్స్‌ పంజాబ్‌-రాజస్తాన్‌ రాయల్స్‌ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఇదే తరహా క్యాచ్‌ను మయాంక్‌ అగర్వాల్‌-మనోజ్‌ తివారీలు అందుకున్న సంగతి తెలిసిందే.

 

మరిన్ని వార్తలు