పొలాక్‌ మదిలో సచిన్‌ కానీ అతడి జాబితాలో..

14 Apr, 2020 11:47 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

హైదరాబాద్‌ : టీమిండియా మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌పై దక్షిణాఫ్రికా మాజీ సారథి షాన్‌ పొలాక్‌ ప్రశంసల వర్షం కురిపించాడు. తన తరం క్రికెటర్లలో అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ సచిన అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు. పరిస్థితులకు తగ్గట్టు తన ఆటను మార్చుకుంటాడని ప్రశంసించాడు. ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పొలాక్‌ పలు ఆసక్తికర విషయాలను పేర్కొన్నాడు.

‘పరిస్థితులను ఆకలింపు చేసుకుని, జట్టు అవసరాలకు తగ్గట్లు తన ఆటను మార్చుకుంటాడు. అతడికి సంధించే షార్ట్‌ పిచ్‌ బంతులను కీపర్‌, స్లిప్‌ ఫీల్డర్ల మీదుగా ఆడే షాట్స్‌ అప్పట్లో ఓ వండర్‌ అనుకోవాలి. టెక్నికల్‌గా అతడి బ్యాటింగ్‌లో ఎలాంటి లోపాలు లేవు. అందుకే ఔట్‌ చేయడం చాలా కష్టంగా అనిపించేది. అయితే అతడు తప్పిదం చేసేవరకు వేచి చూసేవాళ్లం’అని పొలాక్‌ పేర్కొన్నాడు. ఇక సచిన్‌ వన్డేల్లో 9 సార్లు అవుట్‌ చేసిన పొలాక్‌.. ఎక్కువ సార్లు అతడిని అవుట్‌ చేసిన బౌలర్ల జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. 

వివి రిచర్డ్స్‌ పేరు చెప్పిన హోల్డింగ్‌
ఇక ఇదే అంశంపై వెస్టిండీస్‌ మాజీ పేసర్‌ మైకేల్‌ హోల్డింగ్‌ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘నేను చూసిన అప్పడు, ఇప్పుడు, ఎప్పటికీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్‌ వివి రిచర్డ్సే. రిచర్డ్‌ హ్యాడ్లీ, డెన్నీస్‌ లిల్లీ, అబ్ధుల్‌ ఖాదీర్‌, బిషన్‌ బేడి, ఇయాన్‌ బోథమ్‌ వంటి అప్పటి ప్రపంచ ప్రఖ్యాత బౌలర్లను సమర్థవంతంగా ఎలాంటి భయం, బెరుకు లేకుండా పరుగులు రాబట్టాడు. అందుకే రిచర్డ్స్‌ అత్యుత్తమ ఆటగాడని నా అభిప్రాయం’అని హోల్డింగ్‌ పేర్కొన్నాడు. 

మరిన్ని వార్తలు