క్రికెట్ చరిత్రలో తొలిసారి..!

5 Oct, 2017 15:52 IST|Sakshi

సిడ్నీ:ఇక నుంచి మహిళా క్రికెట్ అంపైర్లు మైదానంలో కనిపించబోతున్నారా?, కేవలం మహిళా క్రికెట్ మ్యాచ్ లకే కాకుండా పురుషుల క్రికెట్ మ్యాచ్ ల్లో సైతం మహిళా అంపైర్లు రాబోతున్నారా?అంటే అవుననక తప్పదు. తాజాగా ఆస్ట్రేలియాకు చెందిన మహిళా అంపైర్ క్లైర్ పొలోసాక్ ఒక పురుషుల మ్యాచ్ కి అంపైరింగ్ చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. తద్వారా పురుషుల మ్యాచ్ లకు మహిళా అంపైర్లు అంపైరింగ్ చేసేందుకు రంగం సిద్ధమవుతుందనే విషయం మరింత బలపడుతోంది.

అంపైర్ల ఎలైట్ ప్యానల్ లో కొనసాగుతున్న 29 ఏళ్ల పొలోసాక్..  ఆదివారం జరిగిన దేశవాళీ పురుషుల క్రికెట్ మ్యాచ్ లో అంపైరింగ్ చేశారు. న్యూ సౌత్ వేల్స్-క్రికెట్ ఆస్ట్రేలియా ఎలెవన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో పొలోసాక్ అంపైరింగ్ చేసి ఆకర్షించారు. ఇలా పురుషుల ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో ఒక మహిళ అంపైరింగ్ చేయడం క్రికెట్ చరిత్రలో తొలిసారి కావడం ఇక్కడ విశేషం. అయితే ఆమెకు ఎప్పుడూ క్రికెట్ ఆడిన అనుభవ మాత్రం లేకపోవడం మరో విశేషం. కేవలం అంపైరింగ్ గురించి మాత్రమే తెలుసుకుని అందులో పొలోసాక్ ఆరితేరారు.  ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. 'నేను ఎప్పుడూ క్రికెట్ మ్యాచ్ లు ఆడలేదు. మ్యాచ్ లు చూడటం మాత్రమే ఇష్టం. అందులో అంపైరింగ్ పై ఆసక్తి ఉండేది. దాంతో నాన్న అంపైరింగ్  కోర్సులో చేర్పించారు. అలా అంపైర్ గా స్థిరపడ్డాను. ఇదొక సువర్ణావకాశం. మహిళల క్రికెట్ కు కూడా మరింత స్ఫూర్తిదాయకంగా నిలుసుందని భావిస్తున్నా'అని పొలోసాక్ తెలిపారు.


నో హెల్మెట్..

ఇప్పుడు అంపైర్లు ఫీల్డ్ లో అంపైరింగ్ చేసేటప్పుడు వారి ఇష్టానుసారం కొంత రక్షణ సామాగ్రిని తీసుకోవచ్చు. ఫీల్డ్ లో ఎటువంటి గాయాల బారిన పడకుండా ఉండేందుకు అంపైర్లు హెల్మెట్ వంటివి ధరిస్తున్నారు. కాకపోతే పొలోసాక్ మాత్రం హెల్మెట్ ను ధరించడానికి ఇష్టపడటం లేదు. క్రికెట్ ఫీల్డ్ లో బంతిని సునిశితంగా గమనించేందుకు హెల్మెట్ అడ్డువచ్చే అవకాశం ఉన్న క్రమంలో అందుకు ఆమె విముఖత వ్యక్తం చేశారు. 'నాకు క్రికెట్ ఆస్ట్రేలియా హెల్మెట్ లేదా రక్షణ కవచాన్ని ధరించేందుకు ఆఫర్ చేసింది. అందుకు వారికి ధన్యవాదాలు. నాకు అది ఉపయోగించే అవకాశం రాదనే అనుకుంటున్నా.మనం సరైన స్థానంలోనిల్చుని బంతితో ఫాలో అయితే గాయాల బారిన పడే అవకాశం ఉండదనేది నా అభిప్రాయం. అందుచేత హెల్మెట్ వద్దనా'అని పొలోసాక్ తెలిపారు. మహిళలు అంపైరింగ్ చేసేటప్పుడు ఎటువంటి తడబాటుకు లోనుకాకుండా ఉండాలని సూచించారు.

మరిన్ని వార్తలు