మళ్లీ రికీ పాంటింగ్‌ వైపే మొగ్గు

8 Feb, 2019 15:53 IST|Sakshi

సిడ్నీ: గతంలో ఆస్ట్రేలియా క్రికెట్‌ జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌గా పనిచేసిన ఆ దేశ దిగ్గజ ఆటగాడు రికీ పాంటింగ్‌.. వరల్డ్‌కప్‌కు వెళ్లే ఆస్ట్రేలియా జట్టుకు సైతం అసిస్టెంట్‌ కోచ్‌గా వ్యవహరించనున్నాడు. తాజాగా పాంటింగ్‌ను వరల్డ్‌కప్‌కు వెళ్లే ఆస్ట్రేలియా అసిస్టెంట్‌ కోచ్‌గా నియమిస్తూ క్రికెట్‌ ఆస్ట్రేలియా(సీఏ) నిర్ణయం తీసుకుంది. ఆసీస్‌ రెగ్యులర్‌ బ్యాటింగ్‌ కోచ్‌ గ్రేమ్‌ హిక్‌ రాబోవు యాషెస్‌ సిరీస్‌కు సన‍్నాహకాల్లో ఉండగా, వరల్డ్‌కప్‌కు అసిస్టెంట్‌ కోచ్‌గా పాంటింగ్‌ను నియమించారు. దాంతో ప్రధాన కోచ్‌ జస్టిన్‌ లాంగర్‌తో కలిసి మరొకసారి పాంటింగ్‌ పనిచేయనున్నాడు. 2017, 2018ల్లో ఆస్ట్రేలియా టీ20 జట్టుకు అసిస్టెంట్‌ కోచ్‌గా పాంటింగ్‌ పనిచేసిన సంగతి తెలిసిందే. గతేడాది ఇంగ్లండ్‌కు పర్యటనకు వెళ్లిన ఆసీస్‌ జట్టుకు లాంగర్‌ ప్రధాన కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న సమయంలో పాంటింగ్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా ఉన్నాడు. అదే ఆసీస్‌ జట్టుతో పాంటింగ్‌ కలిసి పని చేయడం చివరిసారి కాగా, ఇప్పుడు మళ్లీ అతనివైపే సీఏ మొగ్గు చూపింది. ఐదు వరల్డ్‌కప్‌ ఆడిన అనుభవంతో పాటు మూడు వరల్డ్‌కప్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించడమే పాంటింగ్‌కు మరొకసారి కీలక బాధ్యతలు అప్పచెప్పడానికి కారణం.

తన నియామకంపై పాంటింగ్ స్పందిస్తూ.. ‘వరల్డ్‌కప్‌కు వెళ్లే ఆసీస్‌ జట్టు సహాయక కోచ్‌గా వ్యవహరించడం కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నా. గతంలో వన్డే, టీ20 జట్లకు షార్ట్‌ టర్మ్‌ అసిస్టెంట్‌ కోచ్‌గా పని చేయడాన్ని బాగా ఎంజాయ్‌ చేశా. కానీ వరల్డ్‌కప్‌కు కూడా నాపై నమ్మకం ఉంచి ఆ బాధ్యతను అప్పగించినందుకు సీఏకు ధన్యవాదాలు. వరల్డ్‌కప్‌లో మేము ఏ జట్టుకైనా కఠినమైన ప్రత్యర్థులమే’ అని తెలిపాడు. ఆస్ట్రేలియా బౌలింగ్‌ కోచ్‌ పదవికి డేవిడ్‌ సాకర్‌ గురువారం రాజీనామా చేసిన విషయం విదితమే.

మరిన్ని వార్తలు