వరల్డ్‌ కప్‌ ఫేవరెట్‌ ఆ టీమే..!

20 May, 2019 12:51 IST|Sakshi

సిడ్నీ: క్రికెట్‌ ప్రపంచ కప్‌ మహాసంగ్రామం ఆరంభమవడానికి కేవలం 10 రోజుల వ్యవధి మాత్రమే ఉంది. అన్ని దేశాల జట్లు తుది ఎలెవెన్‌పై కసరత్తులు చేస్తోండగా మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు మాత్రం తమ ఫేవరెట్‌ జట్లు ఫలానా అని వెల్లడిస్తున్నారు. నిన్నటికి నిన్న ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌, వ్యాఖ్యాత నాసీర్‌ హుస్సేన్‌ ఇండియానే అత్యంత ప్రమాదకర జట్టని, దానికే కప్‌ గెలిచే అవకాశాలు ఎక్కువ అని తెలిపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జాబితాలో మాజీ కెప్టెన్‌, ఆస్ట్రేలియాకు రెండు సార్లు వరల్డ్‌ కప్‌ అందించిన రికీ పాంటింగ్‌ చేరారు. ఈ సారి వరల్డ్‌ కప్‌ హాట్‌ ఫేవరెట్‌ ఇంగ్లండ్‌ అని పంటర్‌ పేర్కొన్నారు. అలాగే ఈ వరల్డ్‌ కప్‌లో సంచలనాలు నమోదవడానికి కూడా అవకాశాలున్నాయని, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ టీంలు ఆ కోవలోకి వస్తాయని ఆయన అన్నారు.

‘బలమైన బ్యాటింగ్‌ లైనప్‌తో ఇంగ్లండ్‌ బలంగా కనిపిస్తోంది. గత కొంత కాలంగా మోర్గాన్‌ నాయకత్వంలో ఇంగ్లండ్‌ టీం అంచనాలకు మించి రాణిస్తోంది. సొంత గడ్డపై ఆడుతుండడం ఆ జట్టుకు సానుకూల అంశం. అదే విధంగా 7వ నెంబర్‌ వరకు దాటిగా బ్యాటింగ్‌ చేయడం కలిసొచ్చే అంశం. అయితే ఇండియా, ఆస్ట్రేలియా రూపంలో ఇంగ్లండ్‌ బలమైన ప్రత్యర్థులను ఎదుర్కొనవలసి ఉంది’అని ఈ మాజీ సారధి జోస్యం చెప్పాడు. మే 30వ తేదీ నుంచి వరల్డ్‌కప్‌ సమరం ఆరంభం కానున్న సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు