‘ఆ నిర్ణయం ఆశ్చర్యానికి గురిచేసింది’

13 Sep, 2019 17:39 IST|Sakshi

లండన్‌: ఆస్ట్రేలియా టెస్టు జట్టు సారథి టిమ్‌ పైన్‌ నిర్ణయంపై ఆ జట్టు సహాయక కోచ్‌, మాజీ సారథి రికీ పాంటింగ్‌ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. యాషెస్‌ సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నిర్ణయాత్మకమైన ఐదో టెస్టులో ఆసీస్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. అయితే టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ కాకుండా బౌలింగ్‌ ఎంచుకోవడంపై పాంటింగ్‌ ఆగ్రహం వ్యక్తం చేశాడు. పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశం ఉందని తాము భావించామని, టాస్‌ గెలిస్తే బ్యాటింగే తీసుకోవాలని నిర్ణయించినట్లు తెలిపాడు. అయితే మ్యాచ్‌ ఫలితం తేలే వరుకు టిమ్‌ పైన్‌ తీసుకున్న నిర్ణయం సరైనదా కాదా అని తెలియదన్నాడు.

 

‘ఆసీస్‌ టాస్‌ గెలిచిందని మ్యాచ్‌ రిఫరీ జవగళ్‌ శ్రీనాథ్‌ ప్రకటించిన వెంటనే.. నేను మా ఆటగాళ్లకు బ్యాటింగ్‌కు సిద్దంకండి అని చెప్పాను. కానీ మమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తూ మా కెప్టెన్‌ బౌలింగ్‌ ఎంచుకున్నాడు. మేం అంచనా వేసినట్టే పిచ్‌ బ్యాటింగ్‌కు అనుకూలించింది. దీంతో లంచ్‌ విరామం వరకు ఇంగ్లండ్‌ 103 పరుగులకు ఒక్క వికెట్‌ మాత్రమే నష్టపోయి పటిష్ట స్థితిలో నిలిచింది. అయితే ఆల్‌రౌండర్‌ మిచెల్‌ మార్ష్‌ ఐదు వికెట్లతో చెలరేగడంతో ఆసీస్‌ ఊపిరి పీల్చుకుంది. లేదంటే ఇంగ్లండ్‌ మా ముందు భారీ స్కోర్‌ నిలిపేదె. టిమ్‌ పైన్‌ నిర్ణయం పూర్తిగా తప్పని నేను చెప్పటం లేదు. కానీ నిర్ణయాత్మక టెస్టులో తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంటే బెటర్‌ అని నా అభిప్రాయం’అని పాంటింగ్‌ పేర్కొన్నాడు. 

ఇక యాషెస్‌ ఐదో టెస్టులో ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 294 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్‌ విధ్వంసకర బ్యాట్స్‌మన్‌ జోస్‌ బట్లర్‌ (70), సారథి జోయ్‌ రూట్‌(57) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. ఆసీస్‌ బౌలర్లలో మిచెల్‌ మార్ష్‌ ఐదు వికెట్లతో చెలరేగగా.. కమిన్స్‌(3/84) రాణించాడు. ఇక ఇప్పటికే 2-1తో ఆధిక్యంలో ఉన్న ఆసీస్‌ ఓవల్‌ టెస్టులో గెలిచి సంపూర్ణంగా యాషెస్‌ సిరీస్‌ గెలుచుకోవాలని పట్టుదలతో ఉండగా.. ఎలాగైనా గెలిచి సిరీస్‌ డ్రా చేసి పరువు నిలుపుకోవాలని ఆతిథ్య ఇంగ్లండ్‌ ఆరాటపడుతోంది. (చదవండి: ‘నన్ను ఆస్ట్రేలియన్లు అసహ్యించుకున్నారు’)

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు