యంగెస్ట్‌ క్రికెట్‌ కోచ్‌.. పేదరికంతో ఎదగలేక

11 Dec, 2019 12:27 IST|Sakshi

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ గుర్తింపు పొందిన మహ్మద్‌గౌస్‌

ప్రోత్సాహం లేక...పేదరికంతో ఎదగలేకపోయిన యువ క్రికెటర్‌

పేదరికంలో ప్రతిభావంతుడు

బంజారాహిల్స్‌: లక్ష్యాన్ని నిర్దేశించుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడా యువకుడు. పేదరికంలో ఉన్నా పట్టుదలతో సాధన చేసి తాను అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నాడు నగరానికి చెందిన పంతొమ్మిదేళ్ల షేక్‌ మహ్మద్‌ గౌస్‌. ఈ పేద యువకుడు ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌లో ఇండియా నుంచి యంగెస్ట్‌ కోచ్‌గా ఎంపికయ్యాడు. అహర్నిశలు కష్టపడి సాధన చేసి పెద్దలను మెప్పించి ఈ స్థాయికి చేరుకున్నాడు. ఈ క్రమంలో అతడి ప్రయాణం అంత సాదాసీదాగా సాగలేదు. 

టోలిచౌకిలో నివసించే గౌస్‌ తండ్రి అబ్దుల్‌ ఖాదర్‌ వలీ వికలాంగుడు కాగా, తల్లి పర్వీన్‌ చీరలు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. కృష్ణానగర్‌లోని విద్యానికేతన్‌ స్కూల్‌లో పదో తరగతి వరకు చదివిన మహ్మద్‌ గౌస్‌ ప్రస్తుతం కూకట్‌పల్లిలోని గౌతమి డిగ్రీ కళాశాలలో బీఎస్సీ చివరి సంవత్సరం చదువుతున్నాడు. తన పదో ఏట నుంచే క్రికెట్‌ పట్ల మక్కువ పెంచుకున్న ఇతడు స్కూల్‌తో పాటు కాలేజీలోనూ క్రికెట్‌ టీమ్‌లో అద్భుత ప్రతిభ చూపించాడు. అయితే, ఆర్థికంగా వెనుకబడటం, పెద్దల ప్రోత్సాహం లేకపోవడంతో ప్రతిభ ఉన్నా జాతీయ జట్టులో చోటు సంపాదించుకోలేకపోయాడు. అండర్‌–19 జట్టులోకి వెళ్లడానికి ఇతడు చేసిన ప్రయత్నాలకు కూడా ప్రోత్సాహం లేకపోవడంతో విఫలమయ్యాయి. సురేందర్‌ అగర్వాల్‌ టీమ్‌లో ఆడిన మహ్మద్‌ గౌస్‌ ప్రతిభ దశదిశలా చాటినట్లయింది. గత ఆగస్టులో దుబాయ్‌లో జరిగిన ఐసీసీ సమావేశంలో మహ్మద్‌ గౌస్‌ను ఎంగెస్ట్‌ కోచ్‌గా నియమించారు. యూఏఈ క్రికెట్‌ యాజమాన్యం ఈ యువకుడ్ని కోచ్‌గా రావాలంటూ పిలిచినా వెళ్లలేదు. మనదేశాన్ని వదిలి మరో దేశానికి వెళ్లి కోచింగ్‌ ఇవ్వడానికి మనసొప్పలేదని చెబుతున్నాడీ యువకుడు. 

క్రికెట్‌లో చిన్నారులకు శిక్షణ ఇస్తున్న గౌస్‌
నాలా ఎవరూ కాకూడదు..
ప్రస్తుతం తాను అమీర్‌పేట ధరంకరం రోడ్డులో 11 మంది చిన్నారులకు శిక్షణ ఇస్తున్నట్లు చెప్పాడు గౌస్‌. ఇందులో ఫీజు కట్టలేని వారికి మినహాయింపునిచ్చి ఉచితంగా శిక్షణ ఇస్తున్నాడు. వచ్చే జనవరి నాటికి 25 మందికి శిక్షణ ఇవ్వనున్నట్టు వెల్లడించాడు. ప్రతిభ ఉండికూడా పేదరికంతో క్రికెట్‌ ఆడలేని ఎంతోమంది తనలాగే నిస్సహాయులుగా మిగిలిపోతున్నారని, జాతీయ జట్టులో ఆడలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తనలాగా మరొకరు కాకూడదని క్రికెట్‌లో ప్రతిభ గల పేద విద్యార్థులకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్టు చెబుతున్నాడు.

ఉత్తమ క్రీడాకారులను తయారు చేస్తా..
తాను కోచింగ్‌ తీసుకోవడానికి ఆర్థిక పరిస్థితులు అడ్డొవచ్చాయని, దీంతో ముందుకు వెళ్లలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసిన మహ్మద్‌ గౌస్‌.. రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ నుంచి ఉత్తమ క్రీడాకారులను తయారు చేసి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఆడేలా తీర్చిదిద్దుతానన్నాడు. తనకు కోచింగ్‌ ఇవ్వడానికి మంచి స్థలం కేటాయిస్తే ఎంతోమంది పేద విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు అవకాశం ఉంటుందన్నాడు. క్రికెట్‌ ఆడాలకునే ఎంతో మంది చిన్నారులకు శిక్షణ తీసుకోవాలని ఉన్నా మైదానాలు, సౌకర్యాలు లేక వెనకబడిపోతున్నారని ఇలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వాలు ముందు చూపుతో గ్రౌండ్‌లు కేటాయించాలని కోరాడు.

110 ఏళ్ల క్రికెట్‌ చరిత్రలో..
క్రికెట్‌కున్న 110 ఏళ్ల చరిత్రలో 19 ఏళ్ల వయసులో ఇంతవరకు ఎవరూ కోచ్‌ కాలేదని, ఈ ఘనత తనకు మాత్రమే దక్కిందని గౌస్‌ ఆనందం వ్యక్తం చేశాడు. అయితే తనకు లభించిన ఈ ఘనతను ఇంకా చాలా మంది గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ‘యంగెస్ట్‌ కోచ్‌’గా తనకు లభించిన గుర్తింపు సంపన్నుల పిల్లలకు లభించి ఉంటే ఎంతో ఆర్భాటం చేసి ఉండేవారని.. ప్రభుత్వాలు కూడా గౌరవించేవన్నాడు. కానీ పేదలు ఎన్ని విజయాలు, ఘనతలు సాధించినా దానికి ప్రభుత్వం నుంచి ఏమాత్రం గుర్తింపు లేదనడానికి తానే నిదర్శనమన్నాడు.

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు