టీమిండియాను భయపెడుతున్న చెత్త రికార్డు

12 Feb, 2018 12:34 IST|Sakshi

పోర్ట్‌ ఎలిజబెత్‌: తొలి మూడు వన్డేల్లో ఘన విజయాలు సాధించడంతో భారత జట్టులో లోపాలేమిటో తెలీలేదు. కానీ.. నాలుగో వన్డేలో 'గులాబీ' ముల్లు కాస్త గట్టిగానే గుచ్చుకోవడంతో కోహ్లి సేన వైఫల్యం కొట్టిచ్చినట్టు కనబడింది. శిఖర్‌ ధావన్‌, కోహ్లిలు మినహా ఎవరూ రాణించకపోవడంతో భారత జట్టు తేలిపోయింది. వీరిద్దరూ రెండో వికెట్‌కు 158 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించినా దాన్ని మిగతా వారు సద్వినియోగం చేసుకోలేకపోయారు. ఇక బౌలింగ్‌ విభాగంలో కూడా హ్యాట్రిక్‌ విజయాల్లో అందించిన లెగ్‌ స్పిన్నర్లు చాహల్‌, కుల్దీప్‌ వాండరర్స్‌ మ్యాచ్‌లో ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయారు. వీరిద్దరూ 11.3 ఓవర్లలోనే 119 పరుగులు సమర్పించుకుని పరాజయానికి కారణమయ్యారు. దాంతో మంగళవారం పోర్ట్‌ ఎలిజబెత్‌లో సెయింట్‌ జార్జ్‌  వేదికగా జరగనున్న ఐదో వన్డే ఆసక్తిని పెంచుతుంది. ఇప్పటివరకూ భారత జట్టు ఇక్కడ ఆడిన ఏ ఒక్క వన్డేలోనూ విజయం సాధించకపోవడమే అందుకు కారణం.

తిరుగులేని రికార్డు..

సఫారీలకు ఇక్కడ తిరుగులేని రికార్డు ఉంది. ఇప్పటివరకూ దక్షిణాఫ్రికా 32 మ్యాచ్‌లు ఆడగా అందులో 20  విజయాల్ని సొంతం చేసుకోగా 11 మ్యాచ్‌ల్లో ఓడింది. ఒక మ్యాచ్‌ రద్దయ్యింది. ఇక్కడ 1992లో భారత్‌పై తొలి విజయాన్ని సాధించిన సఫారీలు..చివరగా గతేడాది శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో గెలుపును అందుకున్నారు.పోర్ట్‌ ఎలిజబెత్‌ అంటేనే రెచ్చిపోయే సఫారీలు మరొకసారి అదే పరంపరను కొనసాగించాలనే పట్టుదలగా ఉన్నారు.

కోహ్లి మారుస్తాడా..?

పోర్ట్‌ ఎలిజబెత్‌లో భారత ఆడిన నాలుగు వన్డేల్లో నలుగురు సారథులుగా వ్యవహరించారు. తొలుత మొహ్మద్‌ అజహరుద్దీన్‌ నేతృత్వంలో టీమిండియా మ్యాచ్‌ ఆడగా, ఆపై సచిన్‌ టెండూల‍్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, ఎంఎస్‌ ధోని సారథ్యంలో మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో ఎవర్నీ అదృష్టం వరించలేదు. ఇప్పుడు కోహ్లి వంతు వచ్చింది. మరి పోర్ట్‌ ఎలిజబెత్‌లో ఉన్న చెత్త రికార్డును కోహ్లి మారుస్తాడా.. లేక అదే పునరావృతం చేస్తాడా అనేది తెలియాలంటే రేపటి మ్యాచ్‌ వరకూ ఆగాల‍్సిందే.  ఇరు జట్ల మధ్య రేపు సాయంత్రం గం. 4.30 ని.లకు మ్యాచ్‌ ఆరంభం కానుంది.

మరిన్ని వార్తలు