కృష్ణా నదిలో పవర్‌ బోటింగ్‌ రేస్‌

2 Nov, 2018 01:48 IST|Sakshi

నవంబర్‌ 16 నుంచి 18 వరకు పోటీలు  

బరిలో అమరావతి జట్టు  

సాక్షి, హైదరాబాద్‌: ప్రతిష్టాత్మక ఎఫ్‌1 హెచ్‌2ఓ వరల్డ్‌ చాంపియన్‌షిప్‌ పోటీలకు అమరావతి వేదిక కానుంది. 14 ఏళ్ల తర్వాత ఈ పవర్‌ బోటింగ్‌ రేస్‌ భారత్‌లో జరుగుతోంది. వివిధ దేశాలకు చెందిన దాదాపు 350 మంది డ్రైవర్లు నవంబర్‌ 16 నుంచి 18 వరకు కృష్ణా నదిలో జరిగే పోటీల్లో పాల్గొననున్నారు. తొలిసారి ఇద్దరు మహిళా డ్రైవర్లు కూడా ఎఫ్‌1 హెచ్‌2ఓ రేస్‌లో పాల్గొంటుండటం విశేషం. 2018 గ్రాండ్‌ ప్రి సీజన్‌లో మొత్తం ఏడు రేస్‌లకు గాను ఇప్పటికే పోర్టిమావో (పోర్చుగల్‌), లండన్, ఎవియాన్‌ (ఫ్రాన్స్‌), చైనాలలో రేస్‌లు జరిగాయి. ఐదో రేస్‌ను ఆంధ్రప్రదేశ్‌ రాజధానిలో నిర్వహిస్తున్నారు. తర్వాతి రెండు యూఏఈలో జరుగుతాయి. ప్రపంచంలోనే అతి పెద్దదైన ఈ మెగా పవర్‌ బోట్‌ రేసింగ్‌ ఈవెంట్‌కు యూనియన్‌ ఇంటర్నేషనల్‌ మోటోనాటిక్‌ (యూఐఎం) గుర్తింపుంది.

ఈ పోటీల్లో అమరావతి పేరుతో జట్టు కూడా బరిలో ఉంది. స్వీడన్‌కు చెందిన జొనాస్‌ అండర్సన్, ఎరిక్‌ ఎడిన్‌ ఈ జట్టు డ్రైవర్లుగా ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మరింత గుర్తింపు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ పోటీలను నిర్వహిస్తున్నామని ఏపీ పర్యాటక శాఖ కార్యదర్శి ముకేశ్‌ కుమార్‌ మీనా అన్నారు. గరిష్టంగా గంటకు 220 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోయే బోట్‌ రేసింగ్‌ను పెద్ద సంఖ్యలో చూసేందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎఫ్‌1 హెచ్‌2ఓ ప్రతినిధి మార్కో పీట్రినీ, స్పాన్సర్‌ ఇండియా ఎక్స్‌ట్రీమ్‌కు చెందిన సందీప్‌ మండవ కూడా పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు