ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో పాక్‌కు షాక్‌

25 May, 2019 04:47 IST|Sakshi

అఫ్గానిస్తాన్‌ సంచలనం

బ్రిస్టల్‌: పాకిస్తాన్‌ ప్రపంచకప్‌ సన్నాహకం పరాజయంతో మొదలైంది. అఫ్గానిస్తాన్‌ చేతిలో ఆ జట్టు చిత్తయింది. శుక్రవారం జరిగిన ప్రాక్టీస్‌ మ్యాచ్‌లో అఫ్గాన్‌ 3 వికెట్ల తేడాతో పాక్‌పై గెలిచింది. మొదట పాకిస్తాన్‌ 47.5 ఓవర్లలో 262 పరుగుల వద్ద ఆలౌటైంది. బాబర్‌ ఆజమ్‌ (112; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు) సెంచరీ సాధించగా, షోయబ్‌ మాలిక్‌ (44) రాణించాడు. నబీ 3, దౌలత్‌ జద్రాన్, రషీద్‌ ఖాన్‌ చెరో 2 వికెట్లు తీశారు. తర్వాత లక్ష్యఛేదనకు దిగిన అఫ్గానిస్తాన్‌ 49.4 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 263 పరుగులు చేసి గెలిచింది. హష్మతుల్లా షాహిది (74 నాటౌట్‌; 7 ఫోర్లు), హజ్రతుల్లా (49; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు)రాణించగా, రహ్మత్‌ షా (32; 2 ఫోర్లు, 1 సిక్స్‌), నబీ (34; 3 ఫోర్లు) మెరుగ్గా ఆడారు. వహాబ్‌ రియాజ్‌ 3, ఇమాద్‌ వసీమ్‌ 2 వికెట్లు తీశారు.

దక్షిణాఫ్రికా జయభేరి
కార్డిఫ్‌: మరో ప్రాక్టీస్‌ పోరులో దక్షిణాఫ్రికా 87 పరుగుల తేడాతో శ్రీలంకపై గెలిచింది. ముందుగా సఫారీ జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 338 పరుగుల భారీస్కోరు చేసింది. ఆమ్లా (65; 9 ఫోర్లు), డుప్లెసిస్‌ (88; 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధాటిగా ఆడారు. లక్మల్, నువాన్‌ ప్రదీప్‌ రెండేసి వికెట్లు పడగొట్టారు. తర్వాత శ్రీలంక 42.3 ఓవర్లలో 251 పరుగుల వద్ద ఆలౌటైంది. కరుణరత్నే (87; 12 ఫోర్లు), మాథ్యూస్‌ (64; 6 ఫోర్లు, 1 సిక్స్‌) అర్ధసెంచరీలు సాధించారు.  

>
మరిన్ని వార్తలు