హైదరాబాద్‌ క్రికెటర్ల పరిస్థితే ఇంత : ఓజా

19 Apr, 2019 14:13 IST|Sakshi

రాయుడికి మద్దతుగా ప్రజ్ఞాన్‌ ఓజా ట్వీట్‌

హైదరాబాద్‌ : ప్రపంచకప్‌ జట్టులో హైదరాబాద్‌ క్రికెటర్‌ అంబటి రాయుడిని ఎంపిక చేయకపోవడంపై కొనసాగుతున్న వివాదానికి మరో హైదరాబాద్‌ క్రికెటర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా మరింత అగ్గిని రాజేశాడు. ఇప్పటికే తెలుగు క్రికెటర్లకు తీవ్ర అన్యాయం జరుగుతుందని అభిమానులు మండిపడుతుండగా.. ఓజా చేసిన ట్వీట్‌ క్రికెట్‌ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.

రాయుడు కంటే విజయ్‌ శంకరే మూడు రకాలుగా ఉపయోగపడతాడన్న చీఫ్‌ సెలక్టర్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ వివరణకు వ్యంగ్యంగా.. మూడు రకాలుగా (త్రీ డైమెన్షన్స్‌)  ప్రపంచకప్‌ చూసేందుకు త్రీడి కళ్లద్దాలు ఆర్డర్‌ ఇచ్చానని రాయుడు ట్వీట్‌ చేసిన విషయం తెలిసిందే. ఈ ట్వీట్‌పై బీసీసీఐ కూడా స్పందిస్తూ.. రాయుడి బాధను అర్థం చేసుకోగలమని, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోమని తెలిపిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ప్రజ్ఞాన్‌ ఓజా కూడా ఈ ట్వీట్‌పై స్పందిస్తూ..  ‘హైదరాబాద్‌ క్రికెటర్లలో కొందరి పరిస్థితి ఇంతే. ఇలాంటి పరిస్థితులు నేను ఎదుర్కున్నా. నీ బాధను అర్థం చేసుకోగలను’ అని రాయుడికి మద్దతు తెలుపుతూ ట్వీట్‌ చేశాడు.

లెఫ్టార్మ్‌ స్పిన్నర్‌ అయిన ఓజా టెస్ట్‌ కెరీర్‌ పీక్‌ స్టేజీలో ఉండగా.. కారణం లేకుండా జాతీయ జట్టు నుంచి తొలగించారు. ఈ విషయాన్నే గుర్తు చేస్తూ ఓజా సెలక్షన్‌ ప్యానెల్‌పై పరోక్ష వ్యాఖ్యలు చేశాడు. ఇక క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ ఫేర్‌వేల్‌ టెస్ట్‌లో ఓజా 10 వికెట్లు పడగొట్టి మ్యాన్‌ఆఫ్‌ది మ్యాచ్‌ అదుకున్నాడు. 24 అంతర్జాతీయ టెస్టుల్లో 113 వికెట్లు పడగొట్టాడు. 18 అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు, 6 టీ20లు కూడా ఆడాడు.

మరిన్ని వార్తలు