అతడు బౌలర్‌ కెప్టెన్‌: ఓజా

26 Feb, 2020 14:26 IST|Sakshi

హైదరాబాద్‌: భారత క్రికెట్‌లో విజయవంతమైన కెప్టెన్‌గా వెలుగువెలిగాడు ఎంఎస్‌ ధోని. టీమిండియాకు ఫైనల్‌ ఫోబియా పోయింది ధోని నాయకత్వంలోనే.. అంతేకాకుండా మూడు ఐసీసీ టోర్నీలు అందించిన ఏకైక సారథి కూడా అతడే. ఎంతో మంది యువ క్రికెటర్లను ప్రపంచానికి పరిచయం చేసి.. వారిలోని ప్రతిభను వెలికి తీశాడు. ఆటగాళ్లకు పూర్తి విశ్వాసం కల్పిస్తూ వారికి దిశానిర్దేశం చేసి టీమిండియా ఎన్నో అపూర్వ విజయాలు సాధించడానికి.. ఆ క్రికెటర్ల ఎదుగుదలకు బాటలు వేసిన బాటసారి. వికెట్ల వెనకాల ఉంటూ మైదానం మొత్తం తన కంట్రోల్‌లో ఉంచుకుంటూ వ్యూహాలు రచిస్తూ సహచర క్రికెటర్లుకు మార్గనిర్దేశం చేస్తుంటాడు. ఇదే విషయాన్ని టీమిండియా తాజా మాజీ స్పిన్నర్‌ ప్రజ్ఞాన్‌ ఓజా కూడా పేర్కొన్నాడు.

‘బౌలర్‌ను అర్థం చేసుకునే సారథి ఉండాలని నేను గట్టిగా విశ్వసిస్తాను. అతడు(ధోని) బౌలర్‌ కెప్టెన్. ఈ విషయం నేను ఒక్కడినే కాదు ఇప్పటికే అనేకమంది బౌలర్లు పేర్కొన్నారు. వికెట్ల వెనకాల ఉంటూ మైదానం కొలతలు, ఫీల్డర్లు ఎక్కడెక్కడ ఉన్నారు, బ్యాట్స్‌మన్‌ ఆలోచన ఏవిధంగా ఉందని బౌలర్‌కు ధోని సలహాలిస్తుంటాడు. అదేవిధంగా బౌలర్‌పై ఎలాంటి ఒత్తిడి లేకుండా సూచనలిస్తుంటాడు. దీంతో బౌలర్‌ పని తేలికవుతుంది. అందుకే చాలా మంది బౌలర్లు ధోనిని ప్రశంసిస్తారు. ఐపీఎల్‌లో అనామక దేశ, విదేశ బౌలర్లు సైతం ధోని కెప్టెన్సీలో విజృంభించి వికెట్లు పడగొడుతుంటారు’అంటూ ధోనిపై ఓజా ప్రశంసల వర్షం కురిపించాడు.

ఇక ఇంగ్లండ్‌ వేదికగా జరిగిన ప్రపంచకప్‌ అనంతరం ధోని టీమిండియా జెర్సీ ధరించలేదు. దీంతో రానున్న ఐపీఎల్‌లో రాణించి టీమిండియా టీ20 జట్టులో తిరిగి పునరాగమనం చేయాలని ధోని భావిస్తున్నాడు. ఇక అంతర్జాతీయ క్రికెట్‌కు ఓజా ఇటీవలే రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. భారత్‌ తరఫున 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టీ20లు ఆడాడు. టెస్టుల్లో 113 వికెట్లు సాధించిన ఓజా.. వన్డేల్లో 21 వికెట్లు తీశాడు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో 10 వికెట్లను తీశాడు. ధోని సారథ్యంలోనే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఓజా ‘చకింగ్‌’ కారణంగా అతడి కెరీర్‌ ఇబ్బందుల్లో పడింది. ఆ తర్వాత అంతగా రాణించలేకపోవడంతో టీమిండియాలో స్థానం కోల్పోయాడు. 

చదవండి:
మార్చి 2న మైదానంలోకి ధోని​​​​​​​
ఇలా ఆడితే ఎలా..!​​​​​​​

మరిన్ని వార్తలు