గోపీచంద్‌ అకాడమీ ప్లేయర్లే ఆడాలా?

1 Dec, 2019 10:05 IST|Sakshi

భారత బ్యాడ్మింటన్‌ జట్టు ఎంపికపై డబుల్స్‌ ప్లేయర్‌ ప్రజక్తా సావంత్‌ మండిపాటు  

న్యూఢిల్లీ: దక్షిణాసియా క్రీడల్లో పాల్గొనే భారత బ్యాడ్మింటన్‌ జట్టు ఎంపికపై డబుల్స్‌ ప్లేయర్‌ ప్రజక్తా సావంత్‌ అసంతప్తి వ్యక్తం చేసింది. ఏ ప్రాతిపాదికన భారత్‌కు ప్రాతినిధ్యం వహించే ఆటగాళ్లను ఎంపిక చేశారంటూ సెలక్షన్‌ ప్రక్రియపై మండిపడింది. కనీసం దేశవాళీ టోర్నీల్లోనూ ఆడని ఆటగాళ్లను ప్రతిష్టాత్మక దక్షిణాసియా క్రీడలకు నేరుగా ఎలా ఎంపిక చేస్తారంటూ ట్విట్టర్‌ వేదికగా ‘బాయ్‌’ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మను ప్రశ్నించింది. ‘బాయ్‌ నుంచి అధికారిక ప్రకటన రాకముందే దక్షిణాసియా క్రీడల్లో పాల్గొనే ఆటగాళ్ల ఎంపిక జరిగిపోయింది. దీన్ని నిర్ధారించేలా ఆటగాళ్లు తమ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో దక్షిణాసియా క్రీడల వేదిక నేపాల్‌కు చేరుకున్నామంటూ తమ స్టోరీలను పోస్ట్‌ చేస్తున్నారు. ఏ ప్రాతిపాదికన టీమిండియాను ఎంపిక చేశారు.

కేవలం పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ (పీజీబీఏ) అకాడమీకి చెందిన ప్లేయర్లే భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తారా? ఆలిండియా టోర్నీల్లోనూ ఆడని ఆటగాళ్లకు భారత జట్టులో చోటు ఎలా దక్కింది?’ అని ఆమె ‘బాయ్‌’ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మపై ప్రశ్నల బాణాలు సంధించింది. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన జాతీయ చాంపియన్‌షిప్‌లో మహిళల డబుల్స్‌ టైటిల్‌ నెగ్గిన శిఖా గౌతమ్, అశ్విన్‌ భట్‌లకు టీమిండియాలో చోటు దక్కకపోవడంపై ఆమె అసంతప్తి వ్యక్తం చేసింది.

‘ ఇది పూర్తిగా అన్యాయం. జాతీయ చాంపియన్‌ జోడీకి భారత జట్టులో చోటు దక్కలేదు. ‘బాయ్‌’ ఈ అంశంపై ఎందుకు దష్టి సారించలేదు’ అంటూ ఆమె నిలదీసింది. ఈ వ్యాఖ్యలను ‘బాయ్‌’ అధ్యక్షుడు హిమంత బిశ్వ శర్మ ఖండించారు. జట్టు ఎంపికలో ఎలాంటి పక్షపాతం లేదని స్పష్టం చేశారు. నియమాలకు లోబడి నిర్ణీత ప్రమాణాల ఆధారంగానే ఆటగాళ్లని ఎంపిక చేశామన్నారు. నేపాల్‌ వేదికగా దక్షిణాసియా క్రీడలు జరుగనున్నాయి. ఆదివారం నుంచి టీమ్‌ ఈవెంట్‌లలో పోటీలు జరుగనుండగా... మంగళవారం నుంచి వ్యక్తిగత విభాగాల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తారు.  

మరిన్ని వార్తలు