అత్యుత్తమ ర్యాంక్‌తో అరుదైన ఫీట్‌

11 Feb, 2019 16:40 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత టెన్నిస్‌ ఆటగాడు ప్రజ్నేశ్‌ గుణేశ్వరన్ ఏటీపీ పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో తన కెరీర్‌ అత్యుత్తమ ర్యాంకును సాధించాడు. తాజా ర్యాంకింగ్స్‌లో ప‍్రజ్నేశ్‌ వందలోపు ర్యాంకును సొంతం చేసుకున్నాడు. ఒక్కసారిగా ఆరు స్థానాలను ఎగబాకిన ప్రజ్నేశ్‌ 97 స్థానంలో నిలిచాడు. ఫలితంగా టాప్‌-100లోపు ర్యాంకును అతని కెరీర్‌లో తొలిసారి నమోదు చేశాడు. కాగా, గత పదేళ్లలో ఏటీపీ పురుషుల సింగిల్స్‌ ర్యాంకింగ్స్‌లో వందలోపు ర్యాంకును సాధించిన మూడో భారత ఆటగాడిగా అరుదైన ఘనతను సాధించాడు. అంతకుముందు సోమ్‌దేవ్‌ దేవ్‌వర్మన్, యూకీ బాంబ్రీలు వందలోపు ర్యాంక్‌ సాధించిన భారత ఆటగాళ్లు.

ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా ఓపెన్‌ మెయిన్‌ డ‍్రాకు ప్రజ్నేశ్‌ అర్హత సాధించిన సంగతి తెలిసిందే. మరొకవైపు గతవారం జరిగిన ఏటీపీ చాలెంజర్‌ టోర్నమెంట్‌ చెన్నై ఓపెన్‌లో ప్రజ్నశ్‌ సెమీస్‌కు చేరాడు. దాంతో తన పాయింట్లను మరింత మెరుగుపరుచుకుని టాప్‌-100లో చోటు దక్కించుకున్నాడు. ఇదే ర్యాంక్‌ను ప్రజ్నేశ్‌ కొనసాగిస్తే గ్రాండ్‌ స్లామ్‌ సింగిల్స్‌ మెయిన్‌ డ్రాలో ఆడే అవకాశం ఉంటుంది. ఇక తరచు గాయాల బారిన పడుతున్న యూకీ బాంబ్రీ 156వ స్థానంలో ఉన్నాడు. పలుమార్లు టాప్‌-100లో నిలిచిన యూకీని సుదీర్ఘ కాలంగా గాయాలు వేధిస్తున్నాయి. దాంతో తన ర్యాంక్‌ను క్రమేపీ కోల్పోతూ వస్తున్నాడు. మరొక భారత ఆటగాడు రామ్‌కుమార్‌ రామ్‌నాథన్‌  ఐదు స్థానాలు ఎగబాకి 128 స్థానంలో ఉన్నాడు.

మరిన్ని వార్తలు