ప్రత్యూషకు చేజారిన కాంస్యం

11 Aug, 2015 00:51 IST|Sakshi
ప్రత్యూషకు చేజారిన కాంస్యం

అల్ అయిన్ (యూఏఈ): ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల విభాగంలో ఆంధ్రప్రదేశ్ అమ్మాయి బొడ్డ ప్రత్యూష త్రుటిలో కాంస్య పతకాన్ని చేజార్చుకుంది. సోమవారం ముగిసిన ఈ టోర్నమెంట్‌లో ప్రత్యూష 6.5 పాయింట్లతో విజయలక్ష్మి (భారత్), దినారా సాదుకసోవా (కజకిస్తాన్)లతో కలిసి సంయక్తంగా రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు మిత్రా హెజాజిపౌర్ (ఇరాన్), షెన్ యాంగ్ (చైనా) 7 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంకింగ్స్‌ను వర్గీకరించగా మిత్రాకు టైటిల్ దక్కగా... షెన్ యాంగ్ రన్నరప్‌గా నిలిచింది. విజయలక్ష్మి మూడో స్థానాన్ని పొందగా... ప్రత్యూషకు నాలుగో స్థానం, దినారాకు ఐదో స్థానం లభించాయి. దినారాతో జరిగిన చివరిదైన తొమ్మిదో రౌండ్ గేమ్‌ను ప్రత్యూష 68 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ప్రత్యూష ఐదు గేముల్లో గెలిచి, మూడింటిని ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడింది.

 ఇదే టోర్నీ ఓపెన్ విభాగంలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్లు లలిత్ బాబు (6 పాయింట్లు), కోనేరు హంపి (5.5 పాయింట్లు), ద్రోణవల్లి హారిక (5 పాయింట్లు) వరుసగా 7, 20వ, 35వ స్థానాల్లో నిలిచారు. సలీమ్ సలే (యూఏఈ), సూర్య శేఖర గంగూలీ (భారత్), సేతురామన్ (భారత్) వరుసగా స్వర్ణ, రజత, కాంస్య పతకాలను సాధించారు.
 

మరిన్ని వార్తలు