ప్రత్యూషకు స్వర్ణం

26 Jun, 2013 17:28 IST|Sakshi
ప్రత్యూషకు స్వర్ణం

 ఆసియా యూత్ చెస్
 
 సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ చెస్‌లో మరో తెలుగు తేజం మెరిసింది. గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక బాటలో పయనిస్తూ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మరో అమ్మాయి బొడ్డ ప్రత్యూష ఆసియా యూత్ చాంపియన్‌గా అవతరించింది. ఇరాన్‌లో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో అండర్-18 బాలికల విభాగంలో ప్రత్యూష స్వర్ణ పతకాన్ని సాధించింది.
 
 మంగళవారం ముగిసిన ఈ విభాగంలో ప్రత్యూష ఆరు పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. చివరిదైన ఏడో రౌండ్‌లో ఈ వైజాగ్ అమ్మాయి ఇరాన్ క్రీడాకారిణి రాణా హకీమిఫర్ద్‌ను 38 ఎత్తుల్లో ఓడించింది. మొత్తం ఏడు రౌండ్లకుగాను ప్రత్యూష ఆరింటిలో నెగ్గి మరో గేమ్‌లో ఓడిపోయింది.
 
 ఆసియా ఈవెంట్స్‌లో ప్రత్యూషకిది మూడో పతకం కావడం విశేషం. యాదృచ్ఛికంగా ఈ మూడు పతకాలు ఇరాన్‌లోనే రావడం విశేషం. 2006లో అండర్-10 విభాగంలో ప్రత్యూషకు కాంస్యం దక్కగా... 2008లో అండర్-12 విభాగంలో ఆమె  పసిడి పతకం సాధించింది. ఆసియా యూత్ చెస్ పోటీల్లో కూతురు స్వర్ణ పతకం సాధించడంపట్ల ప్రత్యూష తండ్రి ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు. ‘గ్రాండ్‌మాస్టర్’ హోదా సంపాదించాలనే లక్ష్యంగా సాధన చేస్తున్న ప్రత్యూషకు స్పాన్సర్ల మద్దతు లభిస్తే భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
 

మరిన్ని వార్తలు