కూలీ కొడుకు... ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచాడు

18 Oct, 2018 00:49 IST|Sakshi

ట్రిపుల్‌ జంప్‌లో   ప్రవీణ్‌ చిత్రవేళ్‌కు పతకం

యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో 12వ పతకం  

బ్యూనస్‌ ఎయిర్స్‌ (అర్జెంటీనా): యూత్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ ఖాతాలో మరో పతకం చేరింది. తమిళనాడుకు చెందిన వ్యవసాయ కూలీ కుమారుడు ప్రవీణ్‌ చిత్రవేళ్‌ కాంస్య పతకంతో మెరిశాడు. అతను ట్రిపుల్‌ జంప్‌లో ఈ పతకం సాధించాడు. ఈ క్రీడల్లో ఓవరాల్‌గా భారత్‌కిది 12వ పతకం కాగా... అథ్లెటిక్స్‌లో రెండోది. ఈ పోటీలో అతను స్టేజ్‌–2లో 15.68 మీ.దూరంతో ఐదో స్థానంలో నిలిచాడు. అయితే స్టేజ్‌–1లో మెరుగైన 15.84 మీ. దూరంతో కలిపి 31.52 మీ. సగటుతో పోడియంలో నిలిచి కాంస్యంతో తృప్తిపడ్డాడు. ఈ యూత్‌ ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్‌ ఈవెంట్స్‌లో ఫైనల్స్‌ నిర్వహించడం లేదు. ఒక్కో అథ్లెట్‌కు రెండు అవకాశాలిస్తారు. మెరుగైన సంయుక్త ప్రదర్శన ఆధారంగా స్థానాలను కేటాయిస్తారు.

తంజావూరు జిల్లాలోని ఓ కుగ్రామానికి చెందిన ప్రవీణ్‌ది నిరుపేద కుటుంబం. తండ్రి దినసరి వ్యవసాయ కూలీ. అయితే క్రీడల్లో ప్రావీణ్యమున్న ప్రవీణ్‌ అనుకోకుండా స్పోర్ట్స్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు చెందిన అథ్లె టిక్స్‌ కోచ్‌ ఇందిరా సురేశ్‌ కంటపడ్డాడు. అతని ప్రతిభను గుర్తించిన ఆమె తన శిక్షణలో ప్రవీణ్‌ ప్రదర్శనకు మెరుగులు దిద్దింది. ఈ ఏడాది ఖేలో ఇండియా స్కూల్‌ గేమ్స్‌లో అతను స్వర్ణం, జాతీయ జూనియర్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో రజతం గెలిచాడు. ప్రస్తుతం అతను మంగళూరులోని కాలేజీలో స్పోర్ట్స్‌ కోటాలో బీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.  పురుషుల ఆర్చరీ రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో భారత ఆర్చర్‌ ఆకాశ్‌ ఫైనల్లోకి ప్రవేశించాడు. సెమీఫైనల్లో ఆకాశ్‌ 6–0తో సెన్నా రూస్‌ (బెల్జియం)పై గెలిచి స్వర్ణ–రజత పతక పోరుకు అర్హత సాధించాడు.  

మరిన్ని వార్తలు