బ్యాటింగ్‌ కోచ్‌ రేసులో ఆమ్రే..

29 Jul, 2019 15:24 IST|Sakshi

న్యూఢిల్లీ: భారత మాజీ క్రికెటర్‌ ప్రవీణ్‌ ఆమ్రే టీమిం‍డియా బ్యాటింగ్‌ కోచ్‌ పదవి చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నాడు. ఈ మేరకు బ్యాటింగ్‌ కోచ్‌ పదవికి దరఖాస్తు చేశాడు. టీమిండియా కోచింగ్‌ స్టాఫ్‌ ప్రక్షాళన షురూ అయిన నేపథ్యంలో ఇందుకు పలువురు మాజీ క్రికెటర్లు పోటీ పడుతున్నారు. ప్రధాన కోచ్‌గా రవిశాస్త్రినే తిరిగి కొనసాగించేందుకు బీసీసీఐ మొగ్గు చూపుతున్నట్లు వార్తలు వస్తున్నా, ప్రస్తుతం భారత క్రికెట్‌ జట్టు బ్యాటింగ్‌ కోచ్‌గా ఉన్న సంజయ్‌ బంగర్‌పై వేటు ఖాయంగా కనబడుతోంది. గత ఐదేళ్లలో రవిశాస్త్రి, అనిల్‌ కుంబ్లేలతో  కలిసి బంగర్‌ పని చేసినప్పటికీ భారత క్రికెట్‌ జట్టు బ్యాటింగ్‌ విభాగాన్ని పటిష్ట పరచలేకపోయాడనే అపవాదు ఉంది. ముఖ్యంగా నాల్గో స్థానం ఇప్పటికీ ప్రశ్నార్థకంగా ఉండటంతో బంగర్‌పై బీసీసీఐ ఆసక్తిగా లేదు.

ఈ నేపథ్యంలో ఆమ్రే దరఖాస్తు చేసుకోవడంతో అతను ఒక్కసారిగా రేసులోకి వచ్చేశాడు. అనేక మంది భారత క్రికెటర్లకు గురువుగా వ్యవహరించడం ఆమ్రేకు కలిసొచ్చే అంశం. ప్రధానంగా అజింక్యా రహానే, సురేశ్‌ రైనా, శ్రేయస్‌ అయ్యర్‌, దినేశ్‌ కార్తీక్‌, రాబిన్‌ ఊతప్పులు ఆమ్రే శిక్షణలు రాటుదేలిన వారే. రహానే తన బ్యాటింగ్ టెక్నిక్‌ను మెరుగు పరుచుకునేందుకు ఆమ్రేనే సంప్రదిస్తూ ఉంటాడు.రమాకాంత్‌ ఆచ్రేకర్‌ స్కూల్‌ నుంచి వచ్చి ఆమ్రే.. కొంతకాలంగా యూఎస్‌ఏ క్రికెట్‌ జట్టుకు బ్యాటింగ్‌ కన్సల్టెంట్‌గా వ్యవహరిస్తున్నాడు. మరొకవైపు ఐపీఎల్‌లో రెగ్యులర్‌గా కోచింగ్‌ సర్క్యూట్‌లో ఉంటూ తన బ్యాటింగ్‌ పాఠాలు చెబుతూనే ఉన్నాడు. గత ఐపీఎల్‌ సీజన్‌లో రికీ పాంటింగ్‌, సౌరవ్‌ గంగూలీలతో కలిసి ఢిల్లీ డేర్‌డెవిల్స్‌ జట్టుకు బ్యాటింగ్‌ కోచ్‌గా పని చేశాడు. టీమిండియా కోచింగ్‌ విభాగంలో మార్పులు అవసరమని భావించిన బీసీసీఐ.. అందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. జూలై 30వ తేదీ సాయంత్ర ఐదు గంటల వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. ఆపై కపిల్‌దేవ్‌ నేతృత్వంలోన క్రికెట్‌  సలహా కమిటీ టీమిండియా కోచింగ్‌ బృందాన్ని ఎంపిక చేస్తుంది.

మరిన్ని వార్తలు