ఆసియా సెయిలింగ్‌ పోటీలకు ప్రీతి

13 Aug, 2019 10:00 IST|Sakshi

 ఝాన్సీ ప్రియ, లక్ష్మీ నూకరత్నం కూడా

 భారత జట్టులో వైసీహెచ్‌ సెయిలర్లు  

సాక్షి, హైదరాబాద్‌: ఇటీవల హుస్సేన్‌ సాగర్‌ వేదికగా జరిగిన తెలంగాణ రాష్ట్ర రెగెట్టా చాంపియన్‌షిప్‌లో సత్తా చాటిన హైదరాబాద్‌ యాట్‌ క్లబ్‌ (వైసీహెచ్‌) సెయిలర్లు ప్రీతి కొంగర, ఝాన్సీ ప్రియ, లక్ష్మీ నూకరత్నం గొప్ప అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. ఆసియా–ఓసియానియా అంతర్జాతీయ సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే భారత జట్టుకు వీరు ముగ్గురు ఎంపికయ్యారు. ఒమన్‌ వేదికగా సెప్టెంబర్‌ 30 నుంచి అక్టోబర్‌ 7 వరకు ఈ చాంపియన్‌షిప్‌ జరుగుతుంది. ఇందులో చైనా, సింగపూర్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో పాటు 16 దేశాలకు చెందిన 300 మంది సెయిలర్లు తలపడనున్నారు.

భారత్‌ నుంచి 5 చొప్పున బాలబాలికలను ఈ టోర్నీకి ఎంపిక చేయగా అందులో ఆరుగురు హైదరాబాద్‌ యాట్‌ క్లబ్‌కు చెందిన వారే కావడం విశేషం. బాలుర విభాగంలో విజయ్‌ కుమార్, సచిన్, విశ్వనాథ్‌లు మాజీ వైసీహెచ్‌ సెయిలర్లు కాగా వారు ప్రస్తుతం ఆర్మీ, నేవీ సెయిలింగ్‌ స్కూల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం భారత జట్టుకు ఎంపికైన ప్రీతి నల్లగుట్ట ప్రభుత్వ పాఠశాలలో చదువుతుండగా... ఝాన్సీ, లక్ష్మీ రసూల్‌పురా ఉద్భవ్‌ స్కూల్‌ విద్యార్థులు. వీరంతా ఆర్థికంగా చాలా వెనకబడిన కుటుంబాలకు చెందిన వారైనప్పటికీ కోచ్‌ సుహేమ్‌ షేక్‌ ఆధ్వర్యంలో సెయిలింగ్‌పై ఆసక్తితో ఆటలో గొప్పగా రాణిస్తున్నారు.   

మరిన్ని వార్తలు