ప్రీతిజింతా అసహనం.. సెహ్వాగ్‌ సంచలన నిర్ణయం!

11 May, 2018 11:29 IST|Sakshi

పంజాబ్‌ బాధ్యతల నుంచి తప్పుకోవాలనుకుంటున్న వీరు

సాక్షి, హైదరాబాద్‌ : కింగ్స్‌ పంజాబ్‌ జట్టు కోచ్‌ వీరేంద్ర సెహ్వాగ్‌, యజమాని ప్రీతిజింతా మద్య వివాదం తలెత్తింది. రాజస్థాన్‌ రాయల్స్‌తో జరిగిన ఐపీఎల్‌ మ్యాచ్‌లో పంజాబ్‌ ఓటమికి సెహ్వాగ్‌ను బాధ్యుడిని చేస్తూ జింతా తీవ్ర విమర్శలు చేసినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. రాజస్థాన్‌తో పంజాబ్‌ ఆడిన మ్యాచ్‌లో 158 పరుగులను ఛేజ్‌ చేయలేక చతికల పడి ఓటమి పాలైంది. ఛేదనలో తొలి వికెట్‌ పడిన అనంతరం కరుణ్‌ నాయర్‌, మనోజ్‌ తివారి వంటి ఆటగాళ్లు ఉన్నా అశ్విన్‌ను బ్యాటింగ్‌కు పంపించారు. అయితే కెప్టెన్‌ పరుగులేమీ చేయకుండానే ఔట్‌ అయ్యాడు. అనంతరం ఏ ఒక్కరు జట్టును గెలుపు బాట పట్టించలేక పోయారు. దీంతో పంజాబ్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.

ఓటమితో అసహనానికి గురైన ప్రీతిజింతా ఆవేశంతో కోచ్‌, మెంటర్‌గా ఉన్న వీరూపై మండిపడింది. సెహ్వాగ్‌ పలుసార్లు సహనంతో ఓటమికి కారణాలు చెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయిందని సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. అయినా కూడా ప్రీతిజింతా పదేపదే విమర్శలకు దిగుతుంటడంతో వీరూ ఆలోచనలో పడినట్లు సమాచారం. అంతేకాకుండా వచ్చే ఏడాది జట్టు బాధ్యతలను నుంచి తప్పుకోవాలని ఆయన భావిస్తున్నట్టు జాతీయ మీడియా తెలిపింది.

పంజాబ్‌కు ప్లేఆఫ్స్‌కు అవకాశం ఉండటంతో ఈ విషయంపై విరవణ ఇవ్వడానికి సెహ్వాగ్‌ నిరాకరించారు. ఈ వివాదాలు ఆటగాళ్లపై ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో అటు యాజమాన్యం, ఇటు సెహ్వాగ్‌ మౌనంగా ఉన్నారని సమాచారం. ఈ వివాదంపై ప్రీతిజింతా వివరణ కోసం ప్రయత్నించినా ఆమె స్పందించలేదు. గతంలో సైతం ఇదే తీరుగా ప్రవర్తించారు. గత ఐదేళ్లుగా పంజాబ్‌కు కోచ్‌గా పనిచేస్తున్న వీరేంద్ర సెహ్వాగ్‌, ప్రీతిజింతా మధ్య చాలాసార్లు వివాదాలు తలెత్తాయి.

మరిన్ని వార్తలు