హంటర్స్ ఖేల్‌ఖతం

12 Jan, 2016 01:50 IST|Sakshi
హంటర్స్ ఖేల్‌ఖతం

* లీగ్ దశలోనే హైదరాబాద్ నిష్ర్కమణ
* చివరి మ్యాచ్‌లో ముంబై చేతిలో ఓటమి
* నిరాశపరిచిన కశ్యప్ ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్

సాక్షి, హైదరాబాద్: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్‌లో హైదరాబాద్ హంటర్స్ జట్టు కథ లీగ్ దశలోనే ముగిసింది. ఐదు ‘టై’ లలో నాలుగు ఓడిన హంటర్స్ సెమీఫైనల్ చేరే అవకాశాలను కోల్పోయింది. గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో సోమవారం జరిగిన పోరులో హైదరాబాద్ 1-4 పాయింట్ల తేడాతో ముంబై రాకెట్స్ చేతిలో పరాజయం పాలైంది. సొంతగడ్డపై ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ హంటర్స్ ఓడిపోవడం గమనార్హం.
 
రాకెట్స్‌తో జరిగిన పోరులో మహిళల సింగిల్స్‌లో సుపనిద హంటర్స్ జట్టుకు శుభారంభం అందించింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో సుపనిద 13-15, 15-14, 15-14తో లి జి డైపై విజయం సాధించింది. పురుషుల డబుల్స్‌లో మొగెన్‌సన్-మార్కిస్ కిడో 15-7, 15-14 స్కోరుతో వరుస గేమ్‌లలో నెగ్గి హైదరాబాద్ ఆధిక్యాన్ని 2-0కు పెంచారు. పురుషుల సింగిల్స్‌లో కశ్యప్ (హైదరాబాద్) 11-15, 14-15తో ప్రణయ్ (ముంబై) చేతిలో ఓడిపోయాడు. ఇది హైదరాబాద్‌కు ట్రంప్ మ్యాచ్ కావడంతో ఒక పాయింట్ తగ్గగా, ముంబై ఖాతాలో ఒక పాయింట్ చేరింది. దీంతో స్కోరు 1-1తో సమమైంది. తర్వాతి పురుషుల సింగిల్స్‌ను ముంబై ‘ట్రంప్ మ్యాచ్’గా ఆడింది.

ఇందులో గురుసాయిదత్ 15-12, 15-4తో జూనియర్ సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ సిరిల్ వర్మను ఓడించి ముంబైని 3-1 ఆధిక్యంలోకి తీసుకెళ్లాడు. మిక్స్‌డ్ డబుల్స్‌లో రాకెట్స్ జోడి కమిల్లా జుల్-వ్లదీమర్ ఇవనోవ్ 15-8, 15-8తో గుత్తా జ్వాల-మార్కిస్ కిడోను ఓడించి 4-1తో మ్యాచ్‌ను ముగించారు. మొత్తం లీగ్‌లో ఐదు జట్లతో 25 మ్యాచ్‌లు ఆడిన హంటర్స్ 11 పాయింట్లు సాధించింది. పాయింట్ల పట్టికలో ప్రస్తుతం ఐదో స్థానంలో ఉంది. కాబట్టి సెమీస్‌కు వెళ్లే అవకాశమే లేదు.
 
లీ చోంగ్ వీ దూరం
హైదరాబాద్ రూ.65 లక్షలు ఇచ్చి కొనుక్కున్న మలేసియా స్టార్ లీ చోంగ్ వీ ఈసారి దారుణంగా నిరాశపరిచాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓడిన వీ... తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో గెలిచాడు. ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ ప్రకారం అతను ఆఖరి లీగ్ మ్యాచ్‌లో బరిలోకి దిగలేదు.
 
సత్తా చాటిన సింధు
మరో మ్యాచ్‌లో అవధ్ వారియర్స్ 4-1 పాయింట్ల తేడాతో చెన్నై స్మాషర్స్‌పై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్‌లో చెన్నై ఆటగాడు బ్రైస్ లెవర్డెజ్ 15-13, 15-9తో అవధ్ ప్లేయర్ తనోంగ్‌సక్‌ను ఓడించాడు. అనంతరం వారియర్స్ తరఫున రెండో సింగిల్స్‌లో బరిలోకి దిగిన సాయిప్రణీత్ 12-15, 15-8, 15-13తో సోనీ డి కూంకురోను ఓడించాడు. పురుషుల డబుల్స్‌లో కై యున్-హెండ్ర గునవాన్ 15-13, 15-11తో ప్రణవ్ చోప్రా-టోబీపై గెలుపొందడంతో అవధ్ 2-1తో ముందంజ వేసింది. అయితే ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో పీవీ సింధు 15-7, 15-3 స్కోరుతో వృశాలిని చిత్తుగా ఓడించింది.

దాంతో స్కోరు 2-2తో సమమైంది. చివరగా జరిగిన మిక్స్‌డ్ డబుల్స్ మ్యాచ్ (ఇరు జట్లకూ ట్రంప్ మ్యాచ్)లో అవధ్ జోడి 15-7, 15-10తో క్రిస్ అడ్‌కాక్-పియా జెబదియాపై గెలుపొందింది. దాంతో అవధ్ జట్టుకు రెండు పాయింట్లు రాగా, చెన్నై జట్టు ఒక పాయింట్‌ను కోల్పోయింది. జ్వరం కారణంగా సైనా నెహ్వాల్ (వారియర్స్) ఈ మ్యాచ్‌లో కూడా ఆడలేదు. దాంతో హైదరాబాద్‌లో ఆమె ఆట చూడాలనుకున్న అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది.
 
మంగళవారం విశ్రాంతి దినం. బెంగళూరు వేదికగా బుధవారం జరిగే  చివరి రౌండ్ మ్యాచ్‌ల్లో ముంబై రాకెట్స్‌తో ఢిల్లీ ఏసర్స్; చెన్నై స్మాషర్స్‌తో బెంగళూరు టాప్‌గన్స్ తలపడతాయి.

మరిన్ని వార్తలు