ఆంధ్ర క్రికెట్‌ లీగ్‌కు సిద్ధం 

6 Apr, 2019 01:31 IST|Sakshi

ఆరు జట్లతో టోర్నీని ప్రకటించిన ఏసీఏ 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌ నుంచి మరింత మంది అంతర్జాతీయ స్థాయి క్రికెటర్లను తయారుచేయడమే లక్ష్యంగా ఆంధ్ర క్రికెట్‌ లీగ్‌ త్వరలో అందుబాటులోకి రానుంది. ఆరు జట్లతో కూడిన ఆంధ్ర క్రికెట్‌ లీగ్‌ ఈ ఏడాది చివర్లో జరుగుతుందని ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) ప్రకటించింది. విశాఖపట్నం, విజయవాడ, గోదావరి, చిత్తూరు, కడప, అనంతపురం ఫ్రాంచైజీలకు చెందిన జట్లు లీగ్‌లో పాల్గొంటాయని ఏసీఏ వెల్లడించింది. టి20 ఫార్మాట్‌లో ప్రతీ ఏడాది లీగ్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపింది. ఇప్పటికే ఫ్రాంచైజీల కొనుగోలు కోసం టెండర్లను ఆహ్వానించామని ఏసీఏ అధ్యక్షుడు వీకే రంగరాజు తెలిపారు. ఆంధ్రకు చెందిన పలువురు వ్యాపారవేత్తలు లీగ్‌పై అమిత ఆసక్తి కనబరుస్తున్నట్లు ఆయన చెప్పారు.

‘గత కొన్నేళ్లుగా ఆంధ్రలో క్రికెట్‌ అభివృద్ధి కోసం మెరుగైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు ఇక ఆంధ్ర క్రికెటర్లకు అంతర్జాతీయ స్థాయి మ్యాచ్‌ అనుభవాన్ని కలిగించేలా టి20 ఫార్మాట్‌లో ఆంధ్ర క్రికెట్‌ లీగ్‌ను తీసుకువస్తున్నాం. ఈ ఫ్రాంచైజీ లీగ్‌ ప్రేక్షకులను, క్రికెటర్లను అలరిస్తుందని నమ్ముతున్నా’ అని రంగరాజు పేర్కొన్నారు. టెండర్ల నమోదుకు  ఠీఠీఠీ.్చnఛీజిట్చ ఛిటజీఛిజ్ఛ్టు్చటటౌఛిజ్చ్టీజీౌn.ఛిౌఝ వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు. శుక్రవారం జరిగిన లీగ్‌ ప్రకటన కార్యక్రమంలో ఏసీఏ అధ్యక్షుడు వీకే రంగారాజు, కార్యదర్శి సీహెచ్‌ అరుణ్‌ కుమార్, తదితరులు పాల్గొన్నారు.    

మరిన్ని వార్తలు