పృథ్వీ ‘షా’న్‌దార్‌ 

5 Oct, 2018 00:04 IST|Sakshi

అరంగేట్రంలోనే సెంచరీ బాదిన యువ సంచలనం

రాణించిన పుజారా, కోహ్లి

భారత్‌ 364/4

రాజ్‌కోట్‌: పస లేని బౌలింగ్‌ను ఆటాడుకుంటూ వెస్టిండీస్‌తో తొలి టెస్టులో టీమిండియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా బ్యాట్స్‌మెన్‌ కదంతొక్కడంతో మొదటి రోజే పైచేయి సాధించింది. అరంగేట్ర కుర్రాడు పృథ్వీ షా (154 బంతుల్లో 134; 19 ఫోర్లు) దూకుడైన శతకానికి తోడు వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా (130 బంతుల్లో 86; 14 ఫోర్లు); కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి (137 బంతుల్లో 72 బ్యాటింగ్‌; 4 ఫోర్లు) అర్ధ శతకాలతో రాణించడంతో గురువారం ఇక్కడ ప్రారంభమైన మ్యాచ్‌లో ఆట ముగిసే సమయానికి 4 వికెట్ల నష్టానికి 364 పరుగులు చేసింది. కోహ్లితో పాటు వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌ (21 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్‌ బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నాడు. మ్యాచ్‌కు కొద్దిసేపు ముందు జాసన్‌ హోల్డర్‌ మడమ గాయం కారణంగా దూరమవడంతో బ్రాత్‌వైట్‌ విండీస్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నాడు. 

ఆటంతా అతడే! 
టాస్‌ గెలిచిన టీమిండియా బ్యాటింగ్‌ ఎంచుకుంది. కేఎల్‌ రాహుల్‌ (0) తొలి ఓవర్‌ చివరి బంతికే గాబ్రియెల్‌కు వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూలో బంతి మధ్య వికెట్‌ను తాకుతున్నట్లు తేలడంతో అతడు వెనుదిరిగాడు. అయితే, మరో ఎండ్‌లో పృథ్వీ అలరించాడు. కీమో పాల్‌ బౌలింగ్‌లో మూడు బౌండరీలు బాదాడు. మరో ఎండ్‌లో పుజారా సైతం దూకుడు కనబర్చాడు. తొమ్మిదో ఓవర్లోనే స్పిన్నర్‌ బిషూను దింపినా ఈ జోడీ ఏమాత్రం ఇబ్బందిపడలేదు. ఈ క్రమంలో ఛేజ్‌ బౌలింగ్‌లో సింగిల్‌తో పృథ్వీ అర్ధశతకం (56 బంతుల్లో) పూర్తి చేసుకున్నాడు. కొద్దిసేపటికే పుజారా (67 బంతుల్లో) సైతం ఈ మార్కును చేరుకున్నాడు. అయితే, అర్ధ శతకం తర్వాత షా బ్యాటింగ్‌ మరింత వేగంగా సాగింది. చూస్తుండగానే 60, 70 దాటిపోయింది. 133/1తో భారత్‌ లంచ్‌కు వెళ్లింది. విరామం నుంచి వస్తూనే బిషూ వరుస ఓవర్లలో మూడు బౌండరీలు బాదిన పృథ్వీ 90ల్లోకి వచ్చాడు. పాల్‌ బౌలింగ్‌లో కవర్స్‌లోకి బంతిని కొట్టి డబుల్‌ తీయడంతో అతడి శతకం (99 బంతుల్లో) పూర్తయింది. ఇక్కడినుంచి షా నెమ్మదించగా, పుజారా జోరు పెంచాడు. భాగస్వామ్యం 200 దాటింది. సెంచరీ ఖాయం అనుకుంటున్న దశలో పుజారా అవుటయ్యాడు. టీ విరామానికి ముందు బిషూ వేసిన బంతిని కవర్స్‌ దిశగా పంపే యత్నంలో షా అతడికే క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో అద్భు త ఇన్నింగ్స్‌ ముగిసింది. మూడో సెషన్‌లో ఇన్నిం గ్స్‌ను కోహ్లి, రహానే (92 బంతుల్లో 41; 5 ఫోర్లు) నడిపించారు. 99 బంతుల్లో కోహ్లి అర్ధ శతకం అం దుకోగా, రహానేను ఛేజ్‌ వెనక్కుపంపాడు. నాలుగో వికెట్‌కు వీరిద్దరూ 102 పరుగులు జోడించారు.

పిచ్‌ ఏమీ ఇబ్బంది పెట్టలేదు...! ప్రత్యర్థి నుంచి ప్రతిఘటన అంతకంటే లేదు...!  ఉన్నదంతా యువ కెరటం పృథ్వీ ‘షో’నే...! రోజులో రెండు సెషన్ల ఆట అతడిదే...! మ్యాచ్‌ను అంతగా ఏక పక్షంగా మార్చేశాడీ ముంబైకర్‌...! తనను పోల్చి చూసే సచిన్‌కూ సాధ్యం కాని ఘనతను మంచినీళ్ల ప్రాయంగా అందుకున్నాడీ కుర్ర ఓపెనర్‌..! బెరుకు లేని బ్యాటింగ్‌తో సెంచరీ కొట్టేశాడు...! అరంగేట్రంలోనే షాన్‌దార్‌ ఇన్నింగ్స్‌తో రికార్డులను తిరగరాశాడు...! దీంతో వెస్టిండీస్‌తో తొలి టెస్టును కోహ్లి సేన ఘనంగా ప్రారంభించింది.

ఈ శతకం నాన్నకే అంకితం 
‘‘నేను టీమిండియా కోసం చేసే ప్రతి పరుగులో నాన్నే ఉంటాడు. ఆయన నా కోసం ఎంతో చేశాడు. ఎన్నో వదులుకున్నాడు. తన సంతోషాలన్నీ త్యాగం చేశాడు. కాబట్టే నా శతకం నాన్నకే అంకితం. అరంగేట్రం టెస్టులోనే సెంచరీ సాధించడం చాలా సంతోషాన్నిచ్చింది. అయితే క్రీజులో నేను మాత్రం దీనిని నా తొలి మ్యాచ్‌గా అస్సలు భావించలేదు. నా శైలికి తగ్గట్లే బ్యాటింగ్‌ చేశాను. నిజానికి ఇక్కడ అరంగేట్రం చాన్స్‌ లభించినప్పటికీ... నేనైతే ఇంగ్లండ్‌ పర్యటనకు ఎంపికైనపుడే ఐదు రోజుల ఆటకు మానసికంగా సంసిద్ధమయ్యాను. తుది జట్టులో ఆడించడమనేది కెప్టెన్, కోచ్‌ల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఏదేమైనా ఇక్కడ ఆ చాన్స్‌ లభించింది. ఇక ఈ అవకాశాన్ని జారవిడుచుకోను. నిలకడగా రాణించి స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాను’’             
  –  పృథ్వీ షా  

అదరగొట్టాడు...
‘కుర్రాడు మరీ లేతగా ఉన్నాడు...’ తరహాలో కనిపించినా క్రీజులో తానెంత ఘటికుడినో నిరూపించాడు పృథ్వీ షా. ఆడుతున్నది తొలి టెస్టనే ఒత్తిడి లేదు. షెనాన్‌ గాబ్రియెల్‌ 145 కి.మీ. వేగం తగ్గకుండా బంతులేస్తున్నా బెరుకు లేదు. బౌలింగ్‌ మార్పులతో ప్రత్యర్థి వల పన్నుతున్నా చెక్కు చెదరని ఏకాగ్రత! ఇదీ గురువారం షా ఇన్నింగ్స్‌ సాగిన తీరు. ఫుల్‌ లెంగ్త్‌ బంతి అయితే షాట్‌కు దిగడం, షార్ట్‌ బంతి అయితే ఆచితూచి ఆడటం,  మంచి బంతిని గౌరవంగా వదిలేయడం... ఇలా ఎంతో అనుభవజ్ఞుడిలా, స్పష్టమైన గేమ్‌ ప్లాన్‌తో వచ్చినవాడిలా కనిపించాడతడు. వన్డే తరహాలో ఆడిన పృథ్వీ ఓ దశలో ఎదుర్కొన్న బంతులను మించి పరుగులు చేశాడు. వందకుపైగా స్ట్రయిక్‌ రేట్‌తో శతకం అందుకున్నాడు. అంతటితో సంతృప్తి పడకుండా, మరింత భారీ స్కోరుకు తనను తాను సిద్ధం చేసుకునేందుకా? అన్నట్లు సెంచరీ తర్వాత నిదానించాడు. 

నిబ్బరం... సంబరం 
అవతలి జట్టు ఎలాంటిదైనా టెస్టుల్లో బ్యాట్స్‌మెన్‌కు కావాల్సింది నిబ్బరం. అది ఇన్నింగ్స్‌ తొలి బంతిని ఎదుర్కొన్నప్పటి నుంచే పృథ్వీలో కనిపించింది.  సహజ సిద్ధమైన బ్యాక్‌ఫుట్‌ ఆటకు... ముచ్చటైన స్ట్రోక్‌ ప్లే జోడిస్తూ పరుగులు పిండుకున్నాడు. కట్స్, ఫ్లిక్, హుక్‌ ఇలా అన్ని రకాల షాట్లు కొట్టాడు. అతడు క్రీజులో ఉన్నంతసేపు ఇన్నింగ్స్‌ రన్‌రేట్‌ 4.5 పరుగుల పైనే సాగడం దీనికి నిదర్శనం. రెండు సెషన్ల పాటు నిలిచి జట్టుకు ఒక ఓపెనర్‌ ఏం చేయాలో అది చేసి చూపాడు. ఆఫ్‌సైడ్‌ ఏడుగురు ఫీల్డర్లను మోహరించి షార్ట్, వైడ్, హాఫ్‌ వ్యాలీ బంతులతో ప్రత్యర్థి విసిరిన పరీక్షను అధిగమించాడు. కొన్నిసార్లు దూరంగా వెళ్తున్న బంతులను వెంటాడేందుకు ప్రయత్నించినా పొరపాటును గ్రహించి వెంటనే సర్దుకున్నాడు. చకచకా పరుగులు సాధిస్తున్న పృథ్వీని చూస్తుంటే ఒకప్పటి సెహ్వాగ్‌ గుర్తొచ్చాడు. మొత్తానికి... ఓ పిల్లాడిలా మైదానంలో దిగిన అతడు పెవిలియన్‌ చేరేటప్పటికి అతి పెద్ద పరీక్ష ఉత్తీర్ణుడైనవాడిలా కనిపించాడు.

►పిన్న వయసులో సెంచరీ చేసిన భారత ఆటగాళ్లలో సచిన్‌ (17 ఏళ్ల 107 రోజులు) తర్వాత పృథ్వీ షా (18 ఏళ్ల 329 రోజులు) రెండో స్థానంలో నిలిచాడు.  

► తొలి టెస్టులోనే అతి పిన్న వయసులో సెంచరీ చేసిన జాబితాలో పృథ్వీ నాలుగో స్థానంలో నిలిచాడు. అష్రాఫుల్, మసకద్జా, సలీమ్‌ మాలిక్‌ అతనికంటే చిన్న వయసులో తమ తొలి మ్యాచ్‌లలో శతకాలు బాదారు.  

►సెంచరీ చేసేందుకుపృథ్వీ షాకు పట్టినబంతులు. కెరీర్‌ తొలిటెస్టులో శిఖర్‌ ధావన్‌ (85),డ్వేన్‌ స్మిత్‌ (93) మాత్రమే ఇంతకంటే తక్కువ బంతుల్లోసెంచరీ సాధించారు.

►భారత్‌ తరఫునతొలి టెస్టులోసెంచరీ చేసిన15వ బ్యాట్స్‌మన్‌ పృథ్వీ షా  

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

మరిన్ని వార్తలు