భారత్‌ ‘ఎ’ బోణీ 

19 Jun, 2018 00:48 IST|Sakshi

ఇంగ్లండ్‌ బోర్డు జట్టుపై  భారీ విజయం

రాణించిన పృథ్వీ షా, విహారి   

లీడ్స్‌: ఇంగ్లండ్‌ పర్యటనలో తొలి మ్యాచ్‌లోనే భారత్‌ ‘ఎ’ జట్టు దుమ్మురేపే ఆటతీరును కనబర్చింది. ఆదివారం రాత్రి ఇక్కడ జరిగిన వన్డేలో 125 పరుగులతో ఇంగ్లండ్‌ బోర్డు ప్రెసిడెంట్స్‌ ఎలెవన్‌ను చిత్తు చేసింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ‘ఎ’... నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 328 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (4) విఫలమైనా మరో ఓపెనర్‌ పృథ్వీ షా (61 బంతుల్లో 70; 7 ఫోర్లు, 3 సిక్స్‌లు) దూకుడైన ఆటకు వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ హనుమ విహారి (52 బంతుల్లో 38; 2 ఫోర్లు, 1 సిక్స్‌) అండగా నిలిచాడు.

కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (45 బంతుల్లో 54; 5 ఫోర్లు, 1 సిక్స్‌), కీపర్‌ ఇషాన్‌ కిషన్‌ (46 బంతుల్లో 50; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకాలతో రాణించారు. చివర్లో కృనాల్‌ పాండ్యా (28 బంతుల్లో 34; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) జోరుతో భారీ స్కోరు చేసింది. ఛేదనలో దీపక్‌ చహర్‌ (3/48), అక్షర్‌ పటేల్‌ (2/21) ధాటికి ఇంగ్లండ్‌ బోర్డు జట్టు చేతులెత్తేసింది. 36.3 ఓవర్లలో 203 పరుగులకే ఆలౌటైంది. క్రిచ్‌లీ (40) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. 

మరిన్ని వార్తలు