పృథ్వీ షా, మయాంక్‌ శతకాలు

20 Jun, 2018 01:18 IST|Sakshi

లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌లో భారత్‌ ‘ఎ’ మూడో అత్యధిక స్కోరు

పృథ్వీ షా, మయాంక్‌ శతకాలు

లెస్టర్‌షైర్‌పై 281 పరుగుల తేడాతో ఘనవిజయం   

లెస్టర్‌: భారత యువ క్రికెటర్లు పృథ్వీ షా, మయాంక్‌ అగర్వాల్‌ ఇంగ్లండ్‌ గడ్డపై సెంచరీలతో గర్జించారు. ఫలితంగా లెస్టర్‌షైర్‌ కౌంటీ జట్టుతో మంగళవారం జరిగిన వార్మప్‌ మ్యాచ్‌లో భారత్‌ ‘ఎ’ 281 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ‘ఎ’ జట్ల ముక్కోణపు సిరీస్‌కు ముందు జరిగిన ఈ సన్నాహక పోరులో ఓపెనర్లు పృథ్వీ షా (90 బంతుల్లో 132; 20 ఫోర్లు, 3 సిక్సర్లు), మయాంక్‌ (106 బంతుల్లో 151; 18 ఫోర్లు, 5 సిక్సర్లు) శతకాలతో ప్రాక్టీస్‌ చేశారు. ఇద్దరు తొలి వికెట్‌కు 26 ఓవర్లలోనే 221 పరుగులు జోడించడం విశేషం. శుభ్‌మన్‌ గిల్‌ (54 బంతుల్లో 86; 7 ఫోర్లు, 5 సిక్స్‌లు) కూడా చెలరేగాడు. దాంతో భారత్‌ ‘ఎ’ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 458 పరుగులు చేసింది. తర్వాత కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన లెస్టర్‌షైర్‌ 40.4 ఓవర్లలో 177 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్‌ వెల్స్‌ (62) అర్ధసెంచరీ సాధించాడు. భారత్‌ బౌలర్లలో దీపక్‌ చహర్‌ 3, ప్రసి«ద్‌ కృష్ణ, హుడా, అక్షర్‌ పటేల్‌ తలా 2 వికెట్లు తీశారు. 

టాప్‌–3లో ‘లిస్ట్‌’అయ్యింది... 
వార్మప్‌లో కుర్రకారు జోరుతో బ్యాటింగ్‌లో దుమ్మురేపిన భారత జూనియర్‌ జట్టు లిస్ట్‌ ‘ఎ’ క్రికెట్‌ (దేశవాళీ, అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ల్లో కలిపి) రికార్డుల జాబితాలో చేరింది.  మంగళవారం లెస్టర్‌షైర్‌పై చేసిన 458/4 స్కోరుతో ఈ జాబితాలో మూడో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా రికార్డులకెక్కింది. 2007లో గ్లూసెస్టర్‌షైర్‌పై సర్రే చేసిన 494/4 స్కోరు అగ్రస్థానంలో ఉంది.  

మరిన్ని వార్తలు