పృథ్వీషా ఇరగదీశాడు..

19 Jan, 2020 12:25 IST|Sakshi

లింకోయిన్‌: భారత యువ క్రికెటర్‌ పృథ్వీ షా మరోసారి మెరుపులు మెరిపించాడు. న్యూజిలాండ్‌ పర్యటనలో భాగంగా భారత-ఎ జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న పృథ్వీషా భారీ సెంచరీ సాధించాడు. న్యూజిలాండ్‌ ఎలెవన్‌తో జరిగిన రెండో వన్డే వార్మప్‌ మ్యాచ్‌లో పృథ్వీ షా  100 బంతుల్లో 22 ఫోర్లు, 2 సిక్స్‌ల సాయంతో 150 పరుగులతో ఆకట్టుకున్నాడు. వరుస గాయాలతో సతమవుతున్న పృథ్వీ షా.. కివీస్‌తో తొలి వార్మప్‌ గేమ్‌కు దూరం కాగా, రెండో వన్డే వార్మప్‌ మ్యాచ్‌కు సన్నద్ధమయ్యాడు. తన రీఎంట్రీలోనే పృథ్వీ షా తనదైన శైలిలో బౌండరీల మోత మోగించాడు. 

పృథ్వీ షా ధాటిగా ఆడటంతో పాటు విజయ్‌ శంకర్‌(58; 41 బంతుల్లో 6 ఫోర్లు) దూకుడుగా ఆడటంతో భారత జట్టు 372 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ ఎలెవన్‌ 360 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. కివీస్‌ ఆటగాళ్లలో జాక్‌ బోలే(130), ఫిన్‌ అలెన్‌(87), డార్లీ మిచెల్‌(41), డాన్‌ క్లీవర్‌(44)లు రాణించినా జట్టును గట్టెక్కించలేకపోయారు. భారత బౌలరల్లో  కృనాల్‌ పాండ్యా, ఇషాన్‌ కోర్‌లు తలో రెండు వికెట్లు సాధించగా, మహ్మద్‌ సిరాజ్‌, అక్షర్‌ పటేల్‌లు చెరో వికెట్‌ తీశారు.

పృథ్వీ షా రీఎంట్రీ ఖాయమేనా?
పృథ్వీషా తాజా ప్రదర్శనతో న్యూజిలాండ్‌ పర్యటనకు ఎంపిక చేసే సీనియర్‌ క్రికెట్‌ జట్టులో అతన్ని పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే రోహిత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌ల ఓపెనర్ల బెర్తులు దాదాపు ఖాయం కాగా, మూడో ఓపెనర్‌ ఎవరు అనే దానిపై సెలక్టర్లు మరోసారి పరీక్ష ఎదురుకానుంది. ఎమ్మెస్కే ప్రసాద్‌ నేతృత్వంలో నేడు భారత సీనియర్‌ జట్టు ఎంపిక జరగనుంది. న్యూజిలాండ్‌లో జరిగే టెస్టు, వన్డే సిరీస్‌ కోసం టీమ్‌లను కమిటీ ఆదివారం ఎంపిక చేస్తుంది. వన్డే, టి20ల్లో అద్భుత ఫామ్‌లో ఉన్న లోకేశ్‌ రాహుల్‌ను టెస్టు టీమ్‌లోకి తీసుకునే అవకాశం కనిపిస్తోంది. రాహుల్‌ తన ఆఖరి టెస్టును వెస్టిండీస్‌తో కింగ్‌స్టన్‌లో గత ఆగస్టులో ఆడాడు. కాగా, మూడో ఓపెనర్‌గా కేఎల్‌ రాహుల్‌ను తీసుకుంటారా.. లేక పృథ్వీషాకు అవకాశం ఇస్తారా అనేది చూడాలి. 

>
మరిన్ని వార్తలు