ప్రియదర్శినికి స్వర్ణం

16 Dec, 2017 10:26 IST|Sakshi

 కాంస్యం సాధించిన రాజేశ్వరి

 ఎస్‌జీఎఫ్‌ఐ వెయిట్‌ లిఫ్టింగ్‌ టోర్నీ  

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ స్కూల్‌ గేమ్స్‌ అండర్‌–19 వెయిట్‌లిఫ్టింగ్‌ టోర్నమెంట్‌లో తెలంగాణ అమ్మాయి టి. ప్రియదర్శిని సత్తా చాటింది. హకీంపేట్‌లోని తెలంగాణ స్పోర్ట్స్‌ స్కూల్‌ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో 48 కేజీల విభాగంలో ఆమె స్వర్ణాన్ని కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్లో ప్రియదర్శిని స్నాచ్‌ విభాగంలో 62 కేజీలు, క్లీన్‌ అండ్‌ జర్క్‌ కేటగిరీలో 83 కేజీలతో ఓవరాల్‌ 145 కేజీల బరువునెత్తి విజేతగా నిలిచింది.

ఈ విభాగంలో నూతన్‌ (మహారాష్ట్ర–125 కేజీలు), రమణ్‌దీప్‌ కౌర్‌ (పంజాబ్‌–123 కేజీలు) వరుసగా రజత, కాంస్యాలను సాధించారు. 44 కేజీల విభాగంలో ఆంధ్రప్రదేశ్‌ అమ్మాయి బి. రాజేశ్వరి రాణించింది. ఆమె ఫైనల్లో 103 (48+55) కేజీల బరువునెత్తి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. మహారాష్ట్రకు చెందిన రుతుజా ఠాకూర్‌ (121 కేజీలు) స్వర్ణాన్ని, తమిళనాడుకు చెందిన పూన్‌ గోడి (118 కేజీలు) రజతాన్ని గెలుచుకున్నారు. పోటీలకు ముందు జరిగిన టోర్నీ ప్రారంభోత్సవ కార్యక్రమంలో తూముకుంట ఎంపీపీ చంద్రశేఖర్‌ యాదవ్, తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్‌ స్కూల్‌ ఓఎస్డీ నర్సయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఎస్‌జీఎఫ్‌ఐ పరిశీలకుడు శర్మ, తెలంగాణ వెయిట్‌ లిఫ్టింగ్‌ అధ్యక్షులు కోటేశ్వర్‌ రావు, కార్యదర్శి శ్రీనివాస్‌ రావు, టోర్నీ కార్యనిర్వాహక కార్యదర్శి ఎల్‌. రాజేంద్ర ప్రసాద్,  రాష్ట్ర పరిశీలకుడు జగదీశ్వర్‌ రెడ్డి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు