సింధు వర్సెస్‌ సైనా

23 Dec, 2017 03:12 IST|Sakshi

నేటి నుంచి ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌

తొలి మ్యాచ్‌లో చెన్నై స్మాషర్స్‌తో అవధ్‌ వారియర్స్‌ ఢీ

జనవరి 14న హైదరాబాద్‌లో ఫైనల్‌ 

సా.గం. 7నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం

గువాహటి: బ్యాడ్మింటన్‌ అభిమానులను అలరించడానికి ప్రొ బ్యాడ్మింటన్‌ లీగ్‌ సీజన్‌–3 సిద్ధమైంది. నేటి నుంచి 23 రోజుల పాటు గువాహటి, లక్నో, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్‌ నగరాల్లో ఈ పోటీలు జరుగుతాయి. స్థానిక కరమ్‌బీర్‌ నబీన్‌ చంద్ర బర్డోలాయ్‌ ఏసీ ఇండోర్‌ స్టేడియంలో జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ చెన్నై స్మాషర్స్‌ జట్టు అవధ్‌ వారియర్స్‌తో తలపడనుంది.  మహిళల సింగిల్స్‌ విభాగంలో భాగంగా చెన్నై తరఫున పీవీ సింధు, అవధ్‌ తరఫున సైనా నెహ్వాల్‌లు తొలి మ్యాచ్‌లో తలపడనున్నారు.

ఇటీవలే జాతీయ సీనియర్‌ చాంపియన్‌షిప్‌లో సింధును ఓడించి సైనా జోరు కనబరిచింది. అయినప్పటికీ ముఖాముఖిలో 2–1తో సింధుదే పైచేయిగా ఉంది. సీజన్‌–2లో ఆరు జట్లతో జరిగిన పీబీఎల్‌లో ఈసారి మరో రెండు జట్లు జతయ్యాయి. కొత్తగా అహ్మదాబాద్‌ స్మాష్‌ మాస్టర్స్, నార్త్‌ ఈస్ట్రన్‌ వారియర్స్‌ జట్లు లీగ్‌లో చేరాయి. వీటితో పాటు ఢిల్లీ ఏసర్స్‌ జట్టు పేరు మార్చుకొని ఢిల్లీ డాషర్స్‌ పేరుతో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. పీబీఎల్‌లో తొలిసారిగా మహిళల నం.1 క్రీడాకారిణి తైజు యింగ్‌ (తైవాన్‌) అరంగేట్ర జట్టు అహ్మదాబాద్‌ స్మాషర్స్‌ తరఫున బరిలోకి దిగనుంది. పురుషుల విభాగంలోనూ వరల్డ్‌ నం.1 విక్టర్‌ అక్సెల్‌సన్‌ బెంగళూరు బ్లాస్టర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.

ఈసారి 10 మంది ఒలింపియన్లు లీగ్‌లో పాల్గొననుండటం విశేషం. టోర్నీ ఫార్మాట్‌ ప్రకారం ఇరు జట్ల మధ్య రెండు పురుషుల సింగిల్స్, ఒక మహిళల సింగిల్స్, మిక్స్‌డ్‌ డబుల్స్, పురుషుల డబుల్స్‌ విభాగాల్లో ఐదు మ్యాచ్‌లు జరుగుతాయి. ఒక్కో మ్యాచ్‌ మూడు గేమ్‌ల పాటు జరుగుతుంది. ప్రతీ గేమ్‌కు గరిష్టంగా 15 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. గత సీజన్‌లో 11 పాయింట్లతో గేమ్‌ను నిర్వహించారు. లీగ్‌ దశ ముగిశాక పాయింట్లపరంగా టాప్‌–4 జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. టోర్నీలో కీలకమైన సెమీస్‌ మ్యాచ్‌లతో పాటు, ఫైనల్‌ పోరుకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. టోర్నీ మొత్తం ప్రైజ్‌మనీ రూ.6 కోట్లు.

                                                ట్రోఫీతో 8 జట్ల మార్క్యూ ఆటగాళ్లు

>
మరిన్ని వార్తలు