మంజిత్ మ్యాజిక్

10 Jul, 2016 03:46 IST|Sakshi
మంజిత్ మ్యాజిక్

* బెంగాల్‌పై పుణెరి పల్టాన్ గెలుపు
* ప్రొ కబడ్డీ లీగ్

పట్నా: కెప్టెన్ మంజిత్ చిల్లర్ (11 పాయింట్లు) రైడింగ్, క్యాచింగ్‌లో అదరగొట్టడంతో.. ప్రొ కబడ్డీ లీగ్‌లో పుణెరి పల్టాన్ నాలుగో విజయాన్ని అందుకుంది. శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో 38-31తో బెంగాల్ వారియర్స్‌పై గెలిచింది. దీంతో 25 పాయింట్లతో జాబితాలో అగ్ర స్థానానికి ఎగబాకింది. పల్టాన్ జట్టు ఆరంభం నుంచే రైడింగ్‌లో చెలరేగింది. మంజిత్ రైడింగ్‌కు వెళ్లిన ప్రతిసారీ పాయింట్ తేవడంతో స్పష్టమైన ఆధిక్యాన్ని కనబర్చింది. తొలి అర్ధభాగానికి పుణెరి టీమ్ 20-10 ఆధిక్యంలో నిలిచింది.

రెండో అర్ధభాగంలో కాస్త మెరుగైన ప్రదర్శన చూపిన బెంగాల్ ఆటగాళ్లు క్యాచింగ్‌లో సత్తా చూపెట్టారు. ఓ దశలో 15-30తో ఉన్న స్కోరును క్రమంగా 25-36కి తగ్గించారు. అయితే చివరి మూడు నిమిషాల్లో పుణెరి రెండు పాయింట్లు సాధిస్తే... బెంగాల్ ఆరు పాయింట్లు నెగ్గింది. బెంగాల్ జట్టులో నితిన్ (12 పాయింట్లు) ఒక్కడే మెరుగ్గా ఆడాడు.
 
పట్నాకు తొలి పరాజయం
మరోవైపు ఈ టోర్నీలో పట్నా పైరేట్స్‌కు తొలి పరాజయం ఎదురైంది. 15-33తో దబాంగ్ ఢిల్లీ చేతిలో ఓడింది. గత ఐదు మ్యాచ్‌ల్లో సమష్టిగా చెలరేగిన పట్నా ఆటగాళ్లు ఈ మ్యాచ్‌లో అన్ని రంగాల్లో విఫలమయ్యారు. దబాంగ్ జట్టులో మెరాజ్ షేక్ ఆకట్టుకున్నాడు.
 
నేటి మ్యాచ్‌లు

తెలుగు టైటాన్స్ X దబాంగ్ ఢిల్లీ
రా. గం 8 నుంచి పట్నా పైరేట్స్ X జైపూర్ పింక్ పాంథర్స్
రా. గం 9 నుంచి స్టార్‌స్పోర్ట్స్-2లో ప్రత్యక్ష ప్రసారం

మరిన్ని వార్తలు