యూపీ యోధ మరోసారి చిత్తుచిత్తుగా..

26 Jul, 2019 20:54 IST|Sakshi

హైదరాబాద్‌: ప్రొ కబడ్డీ సీజన్‌ ఏడులో యూపీ యోధ వరుసగా రెండో మ్యాచ్‌లోనూ ఘోరంగా ఓటమిపాలైంది. ఆ జట్టు స్టార్‌ రైడర్‌ మోను గోయత్‌ దారుణంగా విఫలమవడం, సమిష్టి వైఫల్యంతో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయింది. శుక్రవారం హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఇండోర్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో యూపీ యోధ 19-44 తేడాతో గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌ చేతిలో ఓటమి పాలైంది. గుజరాత్‌ ఆటగాళ్లు ఆరంభం నుంచి ఆటాకింగ్‌ ఆడారు. ముఖ్యంగా ఆ జట్టు రైడర్లు రోహిత్‌ గులియా(11), సచిన్‌(6) రెచ్చిపోయారు. దీంతో తొలి అర్దభాగంలోనే గుజరాత్‌ జట్టు 19-9తో భారీ ఆధిక్యంలోకి వెళ్లింది. ఇక గుజరాత్‌ ఢిఫెండర్లు పర్వేష్‌ బైన్సాల్‌(6), మోరె(5) కూడా ఓ చేయి వేయడంతో యూపీ జట్టు పనిపట్టారు. 

యూపీ రైడర్‌ శ్రీకాంత్‌ జాదవ్‌(5) మినహా ఎవరూ అంతగా ఆకట్టుకోలేదు. యూపీ స్టార్‌ రైడర్‌ మోనూ గోయత్‌ ఎనిమిది సార్లు రైడ్‌కు వెళ్లి కేవలం రెండు పాయింట్లు మాత్రమే సాధించాడు. ఇది యూపీపై పెద్ద ప్రభావం చూపింది. గుజరాత్‌ జట్టు 23 రైడ్‌ పాయింట్లు, 14 టాకిల్‌ పాయింట్లతో హోరెత్తించగా.. యూపీ జట్టు 14 రైడ్‌ పాయింట్లు, 5 టాకిల్‌ పాయింట్లతో అందుకోలేకపోయింది. అంతేకాకుండా యూపీ జట్టును ఆలౌట్‌ చేసి మరో మూడు పాయింట్లను గుజరాత్‌ తన ఖాతాలో వేసుకుంది. 
 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా