పట్నా ఫైనల్‌కు...

27 Oct, 2017 00:43 IST|Sakshi

రెండో క్వాలిఫయర్‌లో బెంగాల్‌పై గెలుపు

మళ్లీ మెరిసిన ప్రదీప్‌ నర్వాల్‌

రేపు గుజరాత్‌తో తుదిపోరు

చెన్నై: డిఫెండింగ్‌ చాంపియన్‌ పట్నా పైరేట్స్‌ మళ్లీ ఫైనల్‌ కూతకు సిద్ధమైంది. టైటిల్‌ నిలబెట్టుకునేందుకు శనివారం గుజరాత్‌ ఫార్చూన్‌ జెయింట్స్‌తో అమీతుమీకి సై అంటోంది. గురువారం జరిగిన రెండో క్వాలిఫయర్‌లో కెప్టెన్‌ ప్రదీప్‌ నర్వాల్‌ ప్రతాపంతో బెంగాల్‌ వారియర్స్‌ను కంగుతింది. రెండు సార్లు చాంపియన్‌ అయిన పట్నా ఈ మ్యాచ్‌లో 47–44 స్కోరుతో బెంగాల్‌ వారియర్స్‌పై విజయం సాధించింది. చివర్లో నాటకీయ పరిణామాలు పైరేట్స్‌ శిబిరాన్ని కలవరపెట్టినా... చివరకు విజయం మాత్రం పట్నానే వరించింది. మ్యాచ్‌ ముగిసేందుకు ఇంకా ఐదు నిమిషాలే మిగిలున్న దశలో పట్నా 41–27తో విజయబావుటాకు సిద్ధమైపోయింది. కానీ చివరి క్షణాల్లో వారియర్స్‌ ఆటగాళ్లు అనూహ్యంగా పోరాడారు.

ఇటు రైడింగ్‌లో... అటు టాకిల్‌లో వరుసబెట్టి పాయింట్లు సాధించారు. చూస్తుండగానే 46–43తో బెంగాల్‌ రేసులోకి వచ్చింది. ఇక 60 సెకన్ల ఆటే మిగిలింది. ఉత్కంఠ రేపిన మ్యాచ్‌లో పట్నా తెలివైన గేమ్‌ ప్లాన్‌తో ప్రత్యర్థి రైడర్‌కు ఒకరినే సమర్పించుకుంది. తద్వారా ఒక పాయింట్‌నే కోల్పో యింది. చివరి క్షణాల్లో ప్రదీప్‌ రైడింగ్‌కు వెళ్లి టైమ్‌పాస్‌ చేసి ఓ పాయింట్‌ తెచ్చాడు. అంతే మ్యాచ్‌ ముగిసింది. పైరేట్స్‌ ఫైనల్‌ చేరింది. ఈ మ్యాచ్‌లో పట్నా పైరేట్స్‌ విజయ సారథి ప్రదీప్‌ 23 పాయిం ట్లు సాధించాడు. విజయ్, మోనూ గోయట్‌ చెరో 4 పాయింట్లు చేశారు. బెంగాల్‌ వారియర్స్‌ తరఫున మణిందర్‌ సింగ్‌ 17, దీపక్‌ నర్వాల్‌ 10, రాణ్‌ సింగ్‌ 5 పాయింట్లు చేశారు.

మరిన్ని వార్తలు