నేటి నుంచి ప్రొ వాలీబాల్‌ లీగ్‌ 

2 Feb, 2019 00:39 IST|Sakshi

కొచ్చి: లీగ్‌ తెరపైకి కొత్తగా వాలీబాల్‌ వచ్చింది. స్కూల్, కాలేజ్‌ గ్రౌండ్లతో పాటు అక్కడక్కడ కనిపించే ఈ క్రీడ టీవీల్లో కనువిందు చేసేందుకు సిద్ధమైంది. నేటి నుంచి ప్రొ వాలీబాల్‌ లీగ్‌ తొలి సీజన్‌ మొదలవుతోంది. ఆరు ఫ్రాంచైజీ జట్లు రెండు వేదికలు కొచ్చి, చెన్నైలో తలపడతాయి. మొదట 12 లీగ్‌ మ్యాచ్‌లు ఇక్కడ జరుగుతాయి. మరో ఆరు మ్యాచ్‌లు, సెమీఫైనల్స్, ఫైనల్‌ పోటీలు చెన్నైలో నిర్వహిస్తారు. ఈ నెల 22న టైటిల్‌ పోరు జరుగుతుంది. శనివారం కొచ్చి బ్లూ స్పైకర్స్, యూ ముంబా వాలీ జట్ల మధ్య ఇక్కడి రాజీవ్‌గాంధీ ఇండోర్‌ స్టేడియంలో తొలి మ్యాచ్‌ జరుగుతుంది.

ఈ రెండు జట్లతో పాటు బ్లాక్‌హాక్స్‌ హైదరాబాద్, అహ్మదాబాద్‌ డిఫెండర్స్, కాలకట్‌ హీరోస్, చెన్నై స్పార్టన్స్‌ బరిలో ఉన్నాయి. లీగ్‌ దశను 15 పాయింట్ల విధానంలో ఐదు సెట్ల మ్యాచ్‌లుగా నిర్వహిస్తారు. విజయానికి 2 పాయింట్లు లభిస్తాయి. ఐదు సెట్లూ గెలిస్తే వైట్‌వాష్‌గా పేర్కొంటారు. ఇలా చేస్తే అదనంగా మూడు పాయిట్లు లభిస్తాయి. ప్లే ఆఫ్‌ మ్యాచ్‌లను 25 పాయింట్ల విధానంలో నిర్వహిస్తారు. ప్రొ వాలీబాల్‌ లీగ్‌ (పీవీఎల్‌)కు రూపే స్పాన్సర్‌షిప్‌ చేస్తోంది.   

మరిన్ని వార్తలు