‘హాకీ’ ప్రతిభకు ప్రోత్సాహం

3 Jul, 2017 10:40 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో హాకీ క్రీడాభివృద్ధికి కృషిచేస్తోన్న తెలంగాణ హాకీ సంఘం క్రీడాకారుల ప్రతిభకు పట్టం కట్టింది. గత కొంత కాలంగా నిలకడగా రాణిస్తున్న ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ వారి కోసం తొలిసారిగా అవార్డ్స్‌ ఫంక్షన్‌ను నిర్వహించింది. ఆదివారం జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు యువ క్రీడాకారులను అవార్డులతో సత్కరించి వారిని ఉత్సాహపరిచింది. రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో నిలకడగా రాణించిన క్రీడాకారులకు ఈ అవార్డులను అందజేసింది.

 

సబ్‌ జూనియర్‌ విభాగంలో ఎస్‌. శివకుమార్‌ (నల్లగొండ), కె. జ్యోతి (రంగారెడ్డి), జూనియర్‌ కేటగిరీలో రంజిత్‌ చంద్‌ (హైదరాబాద్‌), ఫాతిమా (నిజామాబాద్‌), సీనియర్‌ విభాగంలో రామకృష్ణ (వరంగల్‌), డి. గీత (రంగారెడ్డి)లకు ‘బెస్ట్‌ పెర్ఫార్మర్‌’ అవార్డులు అందజేసింది. క్రీడాకారులతో పాటు కరీంనగర్‌కు చెందిన సురేందర్‌ సింగ్‌ ‘బెస్ట్‌ మేనేజర్‌’ అవార్డును అందుకోగా... సంజయ్‌ కుమార్‌ (హైదరాబాద్‌) బెస్ట్‌ కోచ్‌ పురస్కారాన్ని గెలుచుకున్నారు. అంతర్‌ జిల్లా పోటీలను సమర్థంగా నిర్వహించిన వరంగల్‌ జిల్లాకు కూడా అవార్డు లభించింది.

అధ్యక్షునిగా సరళ్‌ తల్వార్‌: తెలంగాణ హాకీ నూతన అధ్యక్షునిగా తల్వార్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ సరళ్‌ తల్వార్‌ ఎన్నికయ్యారు. ఇప్పటివరకు అధ్యక్షునిగా వ్యవహరించిన కె. అమరేందర్‌ రెడ్డి ఇటీవలే తన పదవికి రాజీ నామా చేయడంతో సరళ్‌ తల్వార్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈ సంఘానికి కార్యదర్శిగా మాజీ హాకీ క్రీడాకారుడు, ఒలింపియన్‌ ఎన్‌. ముఖేశ్‌కుమార్‌ ఉన్నారు.

 

మరిన్ని వార్తలు