బాక్సర్ అలెగ్జాండర్ హత్య

4 Apr, 2016 15:41 IST|Sakshi
బాక్సర్ అలెగ్జాండర్ హత్య

సాన్ జూవాన్: పూర్టో రికా చెందిన యువ బాక్సర్  అలెగ్జాండర్ డి జీసెస్(33) దారుణ హత్యకు గురయ్యాడు. ఆదివారం అతనిపై దాడి చేసిన కొంతమంది దుండగులు కాల్చి చంపారు. అలెగ్జాండర్ను బెల్మొంట్ లోని ఇంటి నుంచి బలవంతంగా తీసుకెళ్లిన దుండగులు అతనిపై పలుమార్లు కాల్పులు జరిపి హత్య చేశారు. స్థానికంగా కలకలం రేపిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


2004లో ఏథెన్స్ ఒలింపిక్స్ లో పూర్టో రికా తరపున  అలెగ్జాండర్ ప్రాతినిధ్యం వహించాడు. ఆపై అనేక అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్న  అలెగ్జాండర్ పలు పతకాలను గెలుచుకున్నాడు. అయితే 2005లో  ప్రొఫెషనల్ బాక్సర్గా మారి 19 బౌట్లలో విజయం సాధించాడు. కాగా, 2009లో అర్జెంటీనా ఆటగాడు సీజర్ రీనే చేతిలో ఓటమి పాలై తొలి ఓటమిని ఎదుర్కొన్నాడు.

అనంతరం గృహహింస కేసులో అలెగ్జాండర్ నాలుగు సంవత్సరాల జైలు జీవితం అనుభవించాడు. ప్రొఫెషనల్ బాక్సింగ్ లో భాగంగా జైలు జీవితం అనుభవిస్తున్న సమయంలోనే ప్రత్యేక అనుమతితో అలెగ్జాండర్ బయటకొచ్చాడు. 2010లో జరిగిన ఆ పోటీలో అలెగ్జండర్ తన దేశానికి చెందిన ఏంజెల్ రోమన్ సునాయాసంగా ఓడించి సత్తాను చాటుకున్నాడు. ఆపై 2013 లో జైలు నుంచి విముక్తి లభించడంతో అప్పట్నుంచి తిరిగి బాక్సింగ్ కెరీర్పై దృష్టి పెట్టాడు. ఆ క్రమంలోనే జావేర్ గార్సియాపై ఏకపక్ష విజయం సాధించి తన పూర్వ వైభవాన్ని చాటుకున్నాడు. అయితే గత నెల్లోనే  తన కెరీర్ లో రెండో ఓటమిని అలెగ్జాండర్ చవిచూశాడు. అలెగ్జండర్ ఓవరాల్ విజయాల రికార్డు 21-2 గా ఉంది. ఇందులో 13 నాకౌట్ మ్యాచ్లు ఉండటం విశేషం.

మరిన్ని వార్తలు