పుజారా అరుదైన మైలురాయి..

6 Dec, 2018 13:12 IST|Sakshi

అడిలైడ్‌: ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో టీమిండియా ఆటగాడు చతేశ్వర పుజారా సెంచరీతో మెరిశాడు. 231 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్‌ సాయంతో సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటింగ్‌ లైనప్‌ కకావికలమైన తరుణంలో పుజారా తనదైన మార్కు ఆట తీరుతో అలరించాడు. 153 బంతుల్లో అర్థ శతకాన్ని సాధించిన పుజారా.. మరో 78 బంతుల్లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఇది పుజారా టెస్టు కెరీర్‌లో 16వ  సెంచరీ.  ఆసీస్‌ బౌలర్ల నుంచి దూసుకొచ్చిన పదునైన బంతులకు ఎదురొడ్డి నిలబడ్డ పుజారా మరొకసారి తన విలువేంటో చూపించాడు.

టాస్‌ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 127 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి చిక్కుల్లో పడింది. లోకేష్‌ రాహుల్‌ (2), మురళీ విజయ్‌ (11), విరాట్‌ కోహ్లీ (3), అజింక్యా రహానె(13), రోహిత్‌ శర్మ(37), రిషబ్‌ పంత్‌(25)లు పెవిలియన్‌కు చేరారు. 41 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయిన తరుణంలో రోహిత్‌ శర్మ-రిషబ్‌ పంత్‌లు కాసేపు మరమ్మత్తులు చేశారు. ఆపై వీరిద్దరూ సైతం వెనుదిరగడంతో టీమిండియా మరింత కష్టాల్లోకి వెళ్లింది. అటు తర్వాత అశ్విన్‌తో కలిసి 52 పరుగుల్ని జత చేసిన పుజారా ఆసీస్‌ బౌలర్లకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఒకవైపు పేస్‌ అటాక్‌ను, మరొకవైపు స్పిన్‌ బౌలింగ్‌ను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ ఆసీస్‌ బౌలర్లకు పరీక్షగా నిలిచాడు. ఈ క్రమంలోనే ఆటలో తొలి రోజు సెంచరీ సాధించాడు. ఫలితంగా ఆసియా వెలుపల తొఇలి రోజు ఆటలో సెంచరీ చేసిన భారత ఆటగాళ్ల జాబితాలో పుజారా స్థానం సంపాదించాడు. ఇప‍్పటివరకూ తొలి రోజు ఆటలో ఐదుగురు భారత ఆటగాళ్లు మాత‍్రమే సెంచరీలు సాధించగా, ఇ‍ప్పుడు పుజారా సైతం వారి సరసన చేరాడు. ఆసియా వెలుపల తొలి రోజు ఆటలో సెంచరీ చేసిన సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో విజయ్‌ మంజ్రేకర్‌, సచిన్‌ టెండూల్కర్‌, వీరేంద్ర సెహ్వాగ్‌, విరాట్‌ కోహ్లి, మురళీ విజయ్‌లు ఉన్నారు. కాగా, విరాట్‌ కోహ్లి రెండు పర్యాయాలు తొలి రోజు సెంచరీ సాధించడం ఇక్కడ విశేషం. 2013, 2016ల్లో కోహ్లి శతకాలు సాధించాడు.


ఐదువేల పరుగుల క్లబ్‌లో పుజారా
చతేశ్వర పుజారా మరో అరుదైన ఘనతను కూడా నమోదు చేశాడు. టెస్టుల్లో ఐదువేల పరుగులు మార్కును అందుకున్నాడు. 108 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో పుజారా ఐదువేల పరుగుల మైలురాయిని సాధించాడు. దాంతో వేగవంతంగా ఈ మార్కును చేరిన భారత ఆటగాళ్ల జాబితాలో రాహుల్‌ ద‍్రవిడ్‌తో కలిసి సంయుక్తంగా ఐదో స్థానంలో నిలిచాడు. సునీల్‌ గావస‍్కర్‌(95 ఇన్నింగ్స్‌లు), వీరేంద్ర సెహ్వాగ్‌(99 ఇన్నింగ్స్‌లు), సచిన్‌(103 ఇన‍్నింగ్స్‌లు), విరాట్‌ కోహ్లి(105 ఇన్నింగ్స్‌లు) వరుస స్థానాల్లో ఉన్నారు.


తొలి రోజు ఆలౌట్‌ కాలేదు..
ఆసీస్‌తో ఆరంభమైన తొలి టెస్టు మొదటి రోజే టీమిండియా ఆలౌట్‌ అవుతుందని అంతా భావించారు. తొలి సెషన్‌లోనే కీలక వికెట్లను చేజార్చుకున్న టీమిండియా తడబాటుకు గురైంది. కానీ పుజారా పోరాటా స్ఫూర్తితో టీమిండియా తిరిగి తేరుకుంది. దాంతో తొలి రోజు ఆట ముగిసే సమయానికి 9 వికెట్లు కోల్పోయి 250 పరుగులు చేసింది. పుజారా(123; 246 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు) తొమ్మిదో వికెట్‌గా  పెవిలియన్‌ చేరాడు. ఫస్ట్‌ డౌన్‌లో వచ్చిన పుజారా ఆద్యంతం ఆకట్టుకుని ఆసీస్‌ బౌలర్లకు చెమటలు పట్టించాడు. అయితే ఇంకా కాసేపట్లో మొదటిరోజు ఆట ముగుస్తుందనగా పుజారా అనవరసర పరుగు కోసం యత్నించి ఔటయ్యాడు. టీమిండియా మిగతా ఆటగాళ్లలో రోహిత్‌ శర్మ(37), రిషబ్‌ పంత్‌(25), అశ్విన్‌(25)లు కాస్త ఫర్వాలేదనిపించగా, రహానే(13), కోహ్లి(3), మురళీ విజయ్‌(11), కేఎల్‌ రాహుల్‌(2)లు తీవ్రంగా నిరాశపరిచారు.

(మరిన్ని ఫొటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) 

మరిన్ని వార్తలు