పుజారా సరికొత్త రికార్డు..

19 Mar, 2017 15:40 IST|Sakshi
పుజారా సరికొత్త రికార్డు..

రాంచీ: భారత టాపార్డర్ ఆటగాడు చటేశ్వర్ పుజారా సరికొత్త రికార్డు నమోదు చేశాడు. ఒక టెస్టు ఇన్నింగ్స్ లో భారత్ తరపున అత్యధిక బంతులను ఆడిన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో  525 బంతుల సుదీర్ఘ ఇన్నింగ్స్ తో అత్యధిక బంతులను ఎదుర్కొన్న భారత్ ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో  నిలిచాడు. తద్వారా ద వాల్ రాహుల్ ద్రవిడ్ 495 బంతుల రికార్డును పుజారా అధిగమించాడు. 2004లో రావల్పిండిలో పాకిస్తాన్ తో జరిగిన టెస్టులో  ద్రవిడ్  ఈ ఫీట్ ను సాధించాడు. ఆ తరువాత ఇంతకాలానికి ఆ ఘనతను నయా వాల్ పుజారా బద్ధలుకొట్టడం ఇక్కడ విశేషం.


ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో 390 బంతులను ఆడిన తరువాత  పుజారా తన వ్యక్తిగత 'అతి పెద్ద' ఇన్నింగ్స్ ను సవరించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంచితే ఈ రోజు ఆటలో పుజారా-సాహాలు కదం తొక్కారు. పుజారా డబుల్ సెంచరీ సాధిస్తే, సాహా సెంచరీతో మెరిశాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ 199 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. కాగా, పుజారా(202;21 ఫోర్లు) డబుల్ సెంచరీ సాధించిన తరువాత ఏడో వికెట్ గా అవుటయ్యాడు.  ఆపై సాహా(117;233 బంతుల్లో8 ఫోర్లు, 1 సిక్స్) అవుటయ్యాడు.

>
మరిన్ని వార్తలు