పుజారా సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్

26 Jul, 2017 16:36 IST|Sakshi
పుజారా సెంచరీ.. భారీ స్కోరు దిశగా భారత్

గాలే: శ్రీలంకతో గాలేలో జరగుతున్న తొలిటెస్టులో భారత క్రికెటర్ చతేశ్వర్ పుజారా శతకం సాధించాడు. 173 బంతుల్లో 8 ఫోర్ల సాయంతో పుజారా సెంచరీ చేశాడు. పుజారా కెరీర్ లో ఇది 12వ సెంచరీ. ఇన్నింగ్స్ 67వ ఓవర్లో లంక బౌలర్ కుమార వేసిన ఐదో బంతిని మిడాన్ వైపు ఆడి రెండు పరుగులు తీయడంతో పుజారా సెంచరీ మార్కు చేరుకున్నాడు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ 27 పరుగుల వద్ద ముకుంద్(12) వికెట్ ను కోల్పోవడంతో పుజారా బ్యాటింగ్ కు దిగాడు.

ఓ వైపు మరో ఓపెనర్ శిఖర్ ధావన్ వేగంగా ఆడుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించగా, మరోవైపు వన్ డౌన్ ఆటగాడు పుజారా ఆచితూచి ఆడాడు. 80 బంతుల్లో అర్థ శతకం చేసిన పుజారా.. ధావన్ (168 బంతుల్లో 190; 31 ఫోర్లు) ఔటయ్యాక మరీ జాగ్రత్తగా ఆడుతూ స్కోరు బోర్డుకు పరుగులు జోడించాడు. కెప్టెన్ విరాట్ కోహ్లీ(3) మాత్రం నిరాశపరిచినా, అనంతరం క్రీజులోకొచ్చిన అజింక్య రహానే సహకారంతో సెంచరీ చేశాడు. పరుగులు చేసేందుకు రహానే ఇబ్బంది పడుతున్నా పుజారా మాత్రం ఏకాగ్రత కోల్పోకుండా లంక బౌలర్ల సహనానికి పరీక్ష పెట్టాడు. 71 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 328పరుగులు చేసిన టీమిండియా భారీ స్కోరు దిశగా సాగుతోంది.

మరిన్ని వార్తలు