గర్జించిన ‘లయన్‌’.. టీమిండియా టపాటపా

9 Dec, 2018 08:30 IST|Sakshi

అడిలైడ్‌: తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియాకు భారత్‌ 323 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. కంగారూలకు భారీ టార్గెట్‌ పెట్టాలన్న టీమిండియా ఆశలు ఫలించలేదు. చివర్లో వరుసగా వికెట్లు కోల్పోవడంతో రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా 307 పరుగులకు పరిమితమైంది. 151/3 ఓవర్‌ నైట్‌ స్కోరుతో నాలుగో రోజు ఆట ప్రారంభించిన కోహ్లి సేన మరో 156 పరుగులు జోడించి మిగతా వికెట్లు కోల్పోయింది.

పుజారా(71), రహానే(70) ఆసీస్‌ బౌలర్లను ఎదురొడ్డి నిలిచినప్పటికీ మిగతా బ్యాట్స్‌మన్‌ నుంచి సహకారం లేకపోవడంతో టీమిండియా సాధారణ స్కోరుకే పరిమితమైంది. రాహుల్‌(44), కోహ్లి(34), పంత్‌(28) భారీ స్కోరు చేయలేకపోయారు. రోహిత్‌ శర్మ(1) విఫలమయ్యాడు. స్థాయికి తగ్గట్టు ఆడలేకపోయాడు.

303 పరుగుల వద్ద రహానే, అశ్విన్‌ను స్టార్క్‌ అవుట్‌ చేయడంతో భారత్‌ పోరాటం ముగిసింది. ఇషాంత్‌ శర్మ, మహ్మద్‌ షమీ పరుగులేమి చేయకుండానే అవుటయ్యారు. ఎక్స్‌ట్రాల రూపంలో నాలుగు పరుగులు రావడంతో భారత్‌ స్కోరు 307 పరుగులకు చేరింది.

ఆస్ట్రేలియా బౌలర్లలో నాథన్‌ లయన్‌ ఏకంగా 6 వికెట్లు పడగొట్టాడు. భారీ భాగస్వామ్యాలు నమోదు కాకుండా అతడు అడ్డుకున్నాడు. తికమక పెట్టే బంతులు సంధించి టీమిండియా ఎక్కువ పరుగులు చేయ​కుండా కట్టడి చేశాడీ రైట్‌ ఆర్మ్‌ ఆఫ్‌బ్రేక్‌ బౌలర్‌. టాప్‌ బ్యాట్స్‌మన్లు పుజారా, కోహ్లి, రహానే, రోహిత్‌ శర్మలను అవుట్‌ చేసి సత్తా చాటాడు. స్టార్క్‌ 3 వికెట్లు తీశాడు. హాజిల్‌వుడ్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నాడు.

మరిన్ని వార్తలు