‘మనసులోని కోరికను బయటపెట్టిన పుజారా’

9 Apr, 2020 09:12 IST|Sakshi

హైదరాబాద్‌: లాక్‌డౌన్‌లోనూ అభిమానులకు కావాల్సిన వినోదాన్ని క్రికెటర్లు అందిస్తున్నారు. మొన్నటివరకు మైదానంలో తమ ఆటతో ఉర్రూతలూగించిన క్రికెటర్లు.. ఇప్పుడు సోషల్‌ మీడియా వేదికగా వెరైటీ ముచ్చట్లతో ఫ్యాన్స్‌ను కాస్త రిలాక్స్‌ మోడ్‌లోకి తీసుకెళుతున్నారు. ఇప్పటికే విరాట్‌ కోహ్లి, రోహిత్‌శర్మ, జస్ప్రిత్‌ బుమ్రా, యజ్వేంద్ర చహల్‌, రిషబ్‌ పంత్‌, కెవిన్‌ పీటర్సన్‌, డేల్‌ స్టెయిన్‌లు ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌ చాట్‌లో సహచర క్రికెటర్లతో పాల్గొంటున్నారు. తాజాగా టీమిండియా స్పెషలిస్టు టెస్టు బ్యాట్స్‌మన్‌ చతేశ్వర్‌ పుజారా కూడా ఇన్‌స్టా లైవ్‌ చాట్‌లోకి వచ్చాడు. సౌరాష్ట క్రికెట్‌ జట్టు సారథి జయదేవ్‌ ఉనాద్కత్‌తో సరాదాగా సంభాంషించాడు. 

ఈ సందర్భంగా పుజారా తను ఆల్‌రౌండర్‌ కావాలనుకుంటున్నానని సరదాగా వ్యాఖ్యానించాడు. అంతేకాకుండా రంజీల్లో సౌరాష్ట్ర తరుపున 203 ఫస్ట్‌ క్లాస్‌ మ్యాచ్‌లు ఆడి 6 వికెట్లు తీసిన విషయాన్ని గుర్తుచేశాడు. దీంతో మధ్యలో కలగజేసుకున్న ఉనాద్కత్‌ ‘సౌరాష్ట్ర రంజీ ట్రోఫీ గెలవడానికి నీ బౌలింగే కారణమంటావే ఏంటి?’అని ప్రశ్నించాడు. అయితే తను అలా అనడం లేదని, ప్రస్తుతం పార్ట్‌ టైమ్‌ బౌలర్‌గా ఉన్న తను పూర్తి ఆల్‌రౌండర్‌గా మారాలని అనుకుంటున్నట్లు తన మనసులోని కోరికను బయటపెట్టాడు. ఇక రంజీ ట్రోఫీ సౌరాష్ట గెలవడం అత్యంత ఆనందం కలిగించిందన్నాడు. అయితే జ్వరం, గొంతు నొప్పితోనే బెంగాల్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ ఆడిన విషయాన్ని గుర్తుచేశాడు. 

ఇక కరోనా వైరస్‌ విజృంభిస్తున్న వేళ ప్రజలెవరూ బయటకు రావద్దని విజ్ఞప్తి చేశాడు. లాక్‌డౌన్‌ సమయంలో కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతూ పూర్తిగా ఇంటికే పరిమితం కావాలని సూచించాడు. సాధారణంగా ఇంట్లో ఉన్నప్పుడే తన భార్యకు సహాయంగా ఉంటానని, ఇప్పుడు ఆమెకు వంటింట్లో, ఇతర పనుల్లో సాయం చేస్తున్నట్లు తెలిపాడు. గతంలో వంట చేసేవాడినని కానీ ప్రస్తుతం ఆ సాహసం చేయట్లేదని తెలిపాడు. ఇక వీరిద్దరికి సంబంధించిన సంభాషణ నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ‘క్రీజులో పాతుకపోయి బౌలర్ల సహనాన్ని పరీక్షించే పుజారాను ఆదర్శంగా తీసుకొని లాక్‌డౌన్‌లో అందరూ ఓపికగా ఇంట్లోనే ఉండాలి’అని ఓ నెటిజన్‌ పేర్నొ​న్నాడు.    

The day when I changed my Batsman status to an All-rounder 😂😂

A post shared by Cheteshwar Pujara (@cheteshwar_pujara) on

చదవండి:
చెప్పేవారు లేరు... చెబితే వినేవారు లేరు!
మహ్మద్‌ కైఫ్‌కు షోయబ్‌ అక్తర్‌ సవాల్‌

మరిన్ని వార్తలు