ఆస్ట్రేలియా క్రికెటర్లకు ఏమైంది?

14 Nov, 2019 11:43 IST|Sakshi

ఒకే తరహాలో ముగ్గురు క్రికెటర్లు విశ్రాంతి

మానసిక కారణాలా.. ఒత్తిడి పెరిగిందా?

సిడ్నీ: ఇటీవల ఆస్ట్రేలియా క్రికెటర్లలో ఎక్కువగా వినిపిస్తున్నమాట మానసిక సమస్యలు. ఇప్పటికే గ్లెన్‌ మ్యాక్స్‌వెల్‌, నిక్‌ మ్యాడిన్‌సన్‌లు తమకు  మానసిక సమస్యలు ఉన్నాయని క్రికెట్‌ ఆస్ట్రేలియాకు విన‍్నవించి తాత్కాలిక బ్రేక్‌ తీసుకున్నారు. ఇప్పుడు ఈ జాబితాలో విల్‌ పుకౌస్వి చేరిపోయాడు. పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌లో భాగంగా ఆసీస్‌ జట్టులో చోటు ఖాయమనుకున్న సమయంలో పుకోస్వి తనకు తానుగా తప్పుకున్నాడు. ఆసీస్‌ క్రికెట్‌ జట్టు సెలక్షన్‌లో అతని పేరు పరిశీలనలో ఉండగా ఇలా అర్థాంతరంగా తప్పుకున్నాడు.

ఇటీవల దేశవాళీ మ్యాచ్‌లో డబుల్‌ సెంచరీ సాధించిన విల్‌ను పాకిస్తాన్‌తో జరుగనున్న సిరీస్‌కు జట్టులోకి తీసుకోవాలని సీఏ భావించింది. అయితే తనకు మానసిక సమస్యలు ఉన్నాయంటూ అతను సీఏకు విన్నవించాడు. ఈ విషయాన్ని ప్రకటించిన క్రికెట్‌ ఆస్ట్రేలియా.. విల్‌ పేరును పక్కన పెడుతున్నట్లు స్పష్టం చేసింది. మానసికంగా ఇబ్బంది పడుతున్న కారణంగానే తాను తప్పుకుంటున్నట్లు పేర్కొన్నట్లు సీఏ తెలిపింది. దాంతోనే తుది నిమిషంలో విల్‌ను తప్పించాల్సి వచ్చిందని తెలిపింది. ప్రస్తుత ఆసీస్‌ క్రికెటర్లకు ఏమైందనేది ప్రధానం చర్చనడుస్తోంది. రెండు వారాల వ్యవధిలో ఒకే కారణంతో ముగ్గురు ఆటగాళ్లు మానసిక కారణాలు చెబుతూ తప్పుకోవడం ఏమిటనేది క్రికెట్‌ వర్గాల్లో ఆసక్తిని రేపుతోంది.

తాజాగా పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌కు 14 మందిని సీఏ ఎంపిక చేసింది. ఇందులో ఓపెనర్‌ మార్కస్‌ హారిస్‌కు ఉద్వాసన పలికింది. అతని స్థానంలో జో బర్న్స్‌కు చోటు కల్పించింది. మరొకవైపు కామెరూన్‌ బాన్‌క్రాఫ్ట్‌ను తిరిగి జట్టులోకి తీసుకుంది. ఇక అన్‌క్యాప్‌డ్‌ బౌలర్‌ మైకేల్‌ నాసెర్‌కు చోటు కల్పించింది. మిచెల్‌ స్టార్క్‌, హజల్‌వుడ్‌, ప్యాట్‌ కమిన్స్‌లతో కూడిన బౌలింగ్‌ యూనిట్‌లో నాసెర్‌కు అవకాశం దక్కింది.

పాకిస్తాన్‌తో టెస్టు సిరీస్‌కు ఆసీస్‌ జట్టు

డేవిడ్‌ వార్నర్‌, జో బర్న్స్‌, లబూషేన్‌, స్టీవ్‌ స్మిత్‌, ట్రావిస్‌ హెడ్‌, బాన్‌క్రాఫ్ట్‌, మాథ్యూవేడ్‌, టిమ్‌పైన్‌, నాథన్‌ లయన్‌, ప్యాట్‌ కమిన్స్‌, హజల్‌వుడ్‌, జేమ్స్‌ పాటిన్‌సన్‌, మిచెల్‌ స్టార్క్‌, మైకేల్‌ నాసెర్‌

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా