కఠినమైనా... అలవాటు పడాల్సిందే

25 Jan, 2020 08:31 IST|Sakshi

అగ్రశ్రేణి క్రీడాకారిణిగా వరుస టోర్నీలు ఆడటం సింధు బాధ్యత

బీడబ్ల్యూఎఫ్‌ షెడ్యూల్‌ నిబంధనపై పుల్లెల గోపీచంద్‌ వ్యాఖ్య  

కోల్‌కతా: ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) నిర్దేశించిన షెడ్యూల్‌ కఠినమైనప్పటికీ సింధు దానికి అలవాటు పడాలని జాతీయ బ్యాడ్మింటన్‌ చీఫ్‌ కోచ్‌ పుల్లెల గోపీచంద్‌ అన్నారు. ఇటీవల అనుకున్న స్థాయిలో ఆడలేకపోతున్నప్పటికీ సింధుకు టోక్యోలో పతకం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇతర భారత టాప్‌ షట్లర్లు కిడాంబి శ్రీకాంత్, సైనా నెహ్వాల్‌ కూడా ‘టోక్యో’కు అర్హత సాధిస్తారని గోపీచంద్‌ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం జూనియర్‌ స్థాయిలోనూ భారత ప్లేయర్లు మెరుగైన ఫలితాలు సాధిస్తున్నారన్న ఆయన భవిష్యత్‌లో భారత బ్యాడ్మింటన్‌ గొప్ప విజయాలు సాధిస్తుందని ఆత్మవిశ్వాసం వ్యక్తం చేశారు. శుక్రవారం ‘డ్రీమ్స్‌ ఆఫ్‌ ఎ బిలియన్‌’ పుస్తకాన్ని ఆవిష్కరించిన ఆయన పలు అంశాలపై మాట్లాడారు. 

అలవాటు పడాల్సిందే... 
బిజీ షెడ్యూల్‌ వల్ల ఆటగాళ్లు ఇబ్బంది పడుతు న్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఆటగాళ్లు ఈ సమస్య ను ఎదుర్కొంటున్నారు. ఒక అగ్రశ్రేణి క్రీడాకారిణిగా ఈ షెడ్యూల్‌కు అలవాటు పడటం సింధు బాధ్యత. ఈ పరిస్థితికి ఆమె అలవాటు పడాలి.  

‘టోక్యో’ పతకం ఖాయం... 
ఒలింపిక్స్‌ ముందు మంచి ప్రిపరేషన్‌పైనే మేం దృష్టి సారించాం. కొన్ని అంశాలపై మేం మరింత శ్రమించాల్సి ఉంది. సింధు తన పొరపాట్లను సరిదిద్దుకునే పనిలో ఉంది. త్వరలోనే మేం వాటిని అధిగమిస్తాం.  కోచ్‌ తు సంగ్‌ పార్క్, ట్రెయినర్‌ శ్రీకాంత్‌లతో కూడిన మా టీమ్‌ దానిపైనే పని చేస్తోంది. సింధు కచ్చితంగా ‘టోక్యో’లో పతకం సాధిస్తుంది. మంచి సన్నాహంతో ప్రత్యర్థిపై సింధు ఆధిపత్యం కనబరిచే వీలుంటుంది.  

శ్రీకాంత్, సైనాపై నమ్మకముంది... 
ఒలింపిక్స్‌కు ముందు ఇంకా 7 టోర్నమెంట్‌లు ఉన్నాయి. సైనా, శ్రీకాంత్‌ ఒలింపిక్స్‌ అర్హతకు సరిహద్దుల్లో ఉన్నారు. ఒకట్రెండు మంచి ప్రదర్శనలు వారి అవకాశాలను మెరుగుపరుస్తాయి. రాబోయే టోర్నీల్లో వారు అద్భుతంగా ఆడాల్సి ఉంది.  

వ్యవస్థ ముఖ్యం... 
భారత్‌ డబుల్స్‌లో రాణించాలంటే ఒక పక్కా ప్రణాళికతో పాటు వ్యవస్థ ముఖ్యం. ఇక్కడికి వచ్చిన విదేశీ కోచ్‌లు కూడా ఇదే కోరుకుంటున్నారు. డబుల్స్‌ ఆటగాళ్ల అభివృద్ధి కోసం ప్రత్యేక వ్యవస్థ ఉండాలి.  

జూనియర్లూ రాణిస్తున్నారు... 
తర్వాతి తరాల కోసం ఇప్పటి వరకు మనం పెద్దగా పెట్టుబడి పెట్టింది లేదు. కానీ యువ క్రీడాకారులు అంతర్జాతీయ ప్లేయర్లుగా ఎదగాలంటే వారికి మంచి అవకాశాలు, సదుపాయాలు కల్పించాలి. ప్రస్తుతం జూనియర్‌ స్థాయిలో చాలా మంది క్రీడాకారులు మెరుగ్గా రాణిస్తున్నారు. 15–19 వయో విభాగంలో అద్భుత ఫలితాలు సాధిస్తున్నారు. వీరంతా భవిష్యత్‌లో గొప్ప గొప్ప విజయాలు సాధిస్తారనడంలో సందేహం లేదు. 

Read latest Sports News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా